ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మాత్రమే కాదు, వారి అవసరాలు, సమస్యలను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. పాలకులు ప్రజా జీవన ప్రమాణాలను మెరుగు పరచాలి. అయితే ప్రజలకు అనుగుణంగా పాలన చేయకపోయినా, వారి సమస్యలను పట్టించుకోకపోయినా అప్పుడు ప్రజలకు పాలకులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రజల తరఫున మీడియా ఆ హక్కును పొంది వారి తరఫున పాలకులను ప్రశ్నిస్తుంది.
అయితే మీడియా పాలకులను ప్రశ్నించినా, ప్రశ్నించకపోయినా ప్రజలకు మాత్రం ఆ హక్కు ఉంటుంది. వారిచే ఎన్నుకోబడిన పాలకులు వారికి జవాబుదారీగా ఉండాలి. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పాలకులు ప్రజల నుంచి దూరంగా ఉంటారు. ప్రజా సమస్యలను పట్టించుకోరు అని కాదు, కానీ ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు బదులు చెప్పేందుకు వారు సుముఖంగా ఉండరు. అయితే ప్రధాని మోదీ కూడా సరిగ్గా ఇందుకే విలేకరుల సమావేశాలు నిర్వహించరా ? అంటే సరిగ్గా చెప్పలేం. కానీ మోదీ మీడియా సమావేశాలను ఎప్పుడూ నిర్వహించరు. ఆయన వాటికి దూరంగా ఉంటారు.
నెల రోజులకు ఒకసారి మన్ కీ బాత్ ద్వారా ఆయన తన మనస్సులో ఉన్న మాటలను ప్రజలకు చెబుతారు. అది వన్ వే. ఆయన చెప్పింది జనాలు వినాలి. అంతే. దేశంలో ఉన్న పరిస్థితులపై, కేంద్రం తీసుకునే నిర్ణయాలపై విలేకరుల సమావేశాలను మోదీ నిర్వహించరు. నిర్వహిస్తే విలేకరుల అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక కాబోలు, మోదీ ప్రెస్‌ను పిలవరు అని అంటారు.
మీకందరికీ తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లో వచ్చిన ఒకే ఒక్కడు మూవీ గుర్తుండే ఉంటుంది. అందులో సీఎంను ఓ సాధారణ మీడియా చానల్‌కు చెందిన జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తాడు. తరువాత ఆ జర్నలిస్టు అడిగే ప్రశ్నలకు సీఎంకే దిమ్మ తిరిగిపోతుంది. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య ఆ జర్నలిస్టు ఒక్క రోజు సీఎం అవుతాడు. దీంతో జనాలకు ఆ సీఎం నచ్చి అతన్ని శాశ్వత సీఎంను చేస్తారు. అది స్టోరీ. మోదీకి కూడా గతంలో ఓ రెండు సార్లు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఇలాంటి అనుభవమే ఎదురైందట. అందుకనే ఆయన విలేకరుల సమావేశాలు నిర్వహించరని చెబుతారు. కానీ కేంద్ర మంత్రులు మాత్రం మీడియాతో మాట్లాడుతారు.
అయితే మోదీ విలేకరుల సమావేశాల్లో ఎందుకు పాల్గొనరు ? అనే విషయం కచ్చితంగా తెలియదు, కానీ పైన తెలిపినవి అందుకు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే అని విశ్లేషకులు అంటారు. మరి భవిష్యత్తులోనైనా ఆయన ప్రెస్‌తో మాట్లాడుతారా, లేదా అన్నది చూడాలి.