ఇకపై తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, ఇండిపెండెంట్ గానే ఉంటానని అన్నారు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు తృణముల్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదని, తాను కూడా ఎవరితో మాట్లాడలేదని చెప్పారు.
వ్యక్తిగత కారణాలవల్ల టీఎంసీ కి చెందిన ఒక నేతతో టచ్ లో ఉన్నారని అన్నారు. ఇకపై ప్రజా జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాలని విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. బిజెపిలో ఎన్నో ఏళ్ల పాటు కొనసాగిన యశ్వంత్ సిన్హా పార్టీ పగ్గాలు మోదీ, అమిత్షాల చేతికి వెళ్లడంతో ఆయన పార్టీ నుండి బయటకు వచ్చారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మార్చ్ 2021లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు యశ్వంత్ సిన్హా.