కరోనా మొదటి వేవ్‌లో ఎక్కువగా వృద్ధులపై కోవిడ్ ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. కోవిడ్ రెండో వేవ్‌లో యుక్త వయస్సు ఉన్నవారు ఎక్కువగా వైరస్ బారిన పడ్డారు. అయితే కోవిడ్ మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని, కోవిడ్ మూడో వేవ్ వస్తే పిల్లలే ఎక్కువగా వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే చాలా మంది నిపుణులు చెప్పారు. అయితే నిజంగానే కోవిడ్ మూడో వేవ్ పిల్లలపై అంతటి ప్రభావం చూపిస్తుందా ? తాజా పరిస్థితి ఎలా ఉంది ? దీనిపై నిపుణులు ప్రస్తుతం ఏమంటున్నారు ? అంటే…
కరోనా మొదటి, రెండో వేవ్‌లలో పెద్దలు, యుక్త వయస్సు వారు ఎక్కువగా కోవిడ్ బారిన పడ్డారు. కనుక మూడో వేవ్‌లో సహజంగానే పిల్లలపై వైరస్ ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారు. అయితే ఇది ఒక అంచనా మాత్రమే. కోవిడ్ మూడో వేవ్‌లో పిల్లలపై వైరస్ ఎలా ప్రభావం చూపిస్తుంది, తీవ్రత ఎక్కువగా ఉంటుందా ? అన్న విషయాలను ఇప్పుడే అంచనా వేయలేమని నిపుణులు తాజాగా పేర్కొంటున్నారు. కోవిడ్ మూడో వేవ్ వస్తుందా, రాదా, వస్తే ఎలాంటి వేరియెంట్లు పుట్టుకొస్తాయి, ఎవరెవరిపై ఎక్కువగా ప్రభావం పడుతుంది ? అనే విషయాలను ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.
అయితే దేశంలో కొన్ని చోట్ల పిల్లలకు ప్రస్తుతం కోవిడ్ సోకుతుందని, కానీ వారిలో చాలా మందికి లక్షణాలు ఉండడం లేదని, కొందరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని, అందువల్ల కోవిడ్ మూడో వేవ్‌లో వైరస్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అనుకోవడం లేదని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందేనని, వారిని ఇంట్లోనే ఉంచాలని, అలాగే దేశంలో పీడియాట్రిక్ హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్సకు సదుపాయాలను ఇప్పటి నుంచే ఏర్పాటు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున పిల్లలు కోవిడ్ బారిన పడితే చికిత్స అందించడం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు.