కర్ణాటకలోని బెంగళూరుకు సమీపంలో ఉన్న నరసాపుర ఏరియాలో విస్ట్రాన్ ఫ్యాకర్టీపై వర్కర్లు పెద్ద ఎత్తున దాడి చేసిన ఘటనకు గాను విస్ట్రాన్ కంపెనీ తప్పు ఒప్పుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ వర్కర్లకు క్షమాపణలు చెప్పింది. అలాగే ఆ కంపెనీకి చెందిన ఇండియా వైస్ ప్రెసిడెంట్‌ను తొలగిస్తున్నట్లు కూడా విస్ట్రాన్ తెలిపింది.
డిసెంబర్ 12వ తేదీన విస్ట్రాన్ కంపెనీకి చెందిన కాంట్రాక్టు వర్కర్లు పరిశ్రమలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు. కిటికీ అద్దాలు, ఫర్నిచర్, సామగ్రి, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మాక్ కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు కేసు విచారిస్తుండగా.. మరోవైపు విస్ట్రాన్ మాత్రం తాము తప్పు చేశామని అంగీకరిస్తూ వర్కర్లకు క్షమాపణలు తెలిపింది.
వర్కర్లకు సంబంధించి వేతనాలను సరిగ్గా చెల్లించకపోవడం, వారి సమస్యలను పట్టించుకోకపోవడం తాము చేసిన తప్పులని విస్ట్రాన్ తెలిపింది. అయితే ఇకపై అలా జరగదని, వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు, వారు తమ సమస్యలను తెలిపేందుకు 24 అవర్ గ్రీవెన్స్ హాట్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, అందులో వర్కర్లు కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్‌లో తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొంది. అంతేకాకుండా వర్కర్లకు పనిగంటలు నిర్దారించడం, వేతనాలు చెల్లించడంలో ఆలస్యం అయినందున ఇకపై ఆ సమస్యలు కూడా ఉండవని స్పష్టం చేసింది.
అయితే మరోవైపు యాపిల్ సంస్థ మాత్రం విస్ట్రాన్ కంపెనీపై ఆంక్షలు విధించింది. కంపెనీలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించేంత వరకు కొత్త ఆర్డర్లను విస్ట్రాన్‌కు ఇవ్వబోమని యాపిల్ స్పష్టం చేసింది.