అరటి పండ్లు అంటే సహజంగానే మనకు బయట అర డజను, డజను లాంటి పరిమాణాల్లో లభ్యమవుతాయి. ఎవరైనా వాటిని అలాగే కొంటారు. ఇక కొందరు గెలల రూపంలోనూ వాటిని కొంటుంటారు. కానీ జాతిని బట్టి వాటి ధర కూడా మారుతుంది. ఎంత ధర పలికినా వాటి రేటు మార్కెట్‌లో రూ.లక్షల్లో అయితే ఉండదు కదా. వందల్లోనే ఉంటుంది. కానీ ఆ మహిళ కొన్ని అరటి పండ్లు కొన్నందుకు ఏకంగా రూ.1.60 లక్షల బిల్లు వేశారు. అవును.. లండన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
లండన్‌కు చెందిన సైంబ్రె బార్నెస్ అనే మహిళ మార్క్స్ అండ్ స్పెన్సర్ అనే రిటెయిల్ స్టోర్‌లో కొన్ని అరటిపండ్లను కొనుగోలు చేసింది. వాటితోపాటు రోజుకు సరిపోయే ఆహారం కోసం ఇంకొన్ని పదార్థాలను కొన్నది. కానీ అరటి పండ్లకు మాత్రం ఏకంగా 1600 పౌండ్ల (దాదాపుగా రూ.1.60 లక్షలు) బిల్లు వేశారు. ఆమె తన యాపిల్ క్రెడిట్ కార్డుతో కాంటాక్ట్ లెస్ పద్ధతిలో బిల్ చెల్లించింది.
అయితే 1 పౌండ్‌కు బదులుగా 1600 పౌండ్ల బిల్ రావడంతో ఆమె వెంటనే అలర్ట్ అయింది. తన ఫోన్‌కు అంత మొత్తానికి చెందిన ట్రాన్సాక్షన్ ఎస్ఎంఎస్ వచ్చింది. అప్పటికే స్టోర్‌లో బిల్ కూడా ప్రింట్ అయింది. అయితే వెంటనే తప్పును గ్రహించిన ఆమె స్టోర్ నిర్వాహకులను సంప్రదించింది. అయితే తమ స్టోర్ మెయింటెనెన్స్‌లో ఉందని, తమ కంపెనీకి చెందిన ఇంకో స్టోర్ కొంత దూరంలో ఉందని, అక్కడికి వెళ్తే ఆ మొత్తం రీఫండ్ చేస్తారని చెప్పారు. దీంతో ఆమె 45 నిమిషాల పాటు పరుగు పరుగున నడుచుకుంటూ ఇంకో స్పెన్సర్ స్టోర్ కు వెళ్లి జరిగింది వివరించింది. దీంతో వారు ఆమెకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేశారు. స్టోర్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన సాంకేతిక సమస్య కారణంగానే 1 పౌండ్‌కు బదులుగా 1600 పౌండ్ల బిల్ నమోదు అయిందని స్టోర్ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా ఆ మహిళ అలర్ట్‌గా ఉండబట్టి తన డబ్బు తనకు వాపస్ వచ్చింది. లేదంటే పెద్ద నష్టమే జరిగి ఉండేది.