మహిళా సర్పంచ్ పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నించగా స్థానికుల సమాచారంతో ఆమె భర్త వచ్చి కాపాడారు. అనంతరం పోలీసులకు నిందితులపై ఫిర్యాదు చేశారు. కానీ ఆమె అవమానం భరించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. మహిళా సర్పంచ్ మృతితో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామ సర్పంచ్ పై భూక్యా నవీన్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఆగస్ట్ 2న కోమటిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భూక్యా నవీన్ కు గుగులోత్ బుజ్జి అనే వ్యక్తి సహకరించాడు. అయితే ఇది గమనించిన మరో వ్యక్తి సర్పంచ్ భర్తకి ఫోన్ చేశాడు. దీంతో భర్త అక్కడికి వచ్చి భార్యను రక్షించారు. అనంతరం సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కాగా ఈ వ్యవహారంపై సర్పంచ్ తన పరువు పోయిందనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ సర్పంచ్ గురువారం మృతి చెందింది. సర్పంచ్ పై అత్యాచారయత్నానికి పాల్పడిన నవీన్, అతనికి సహకరించిన బుజ్జి పై పోలీసులు కేసు నమోదు చేశారు.