ఆల్జీమర్స్ అనేది మతిమరుపుకు సంబంధించినది. వయసు పెరుగుతున్న కొద్దీ విషయాలు మర్చిపోవడం సహజం. ఐతే ఆల్జీమర్స్ ఉన్న వ్యక్తులు ఎక్కువగా మర్చిపోతుంటారు. ప్రతీ ఏడాది సెప్టెంబరు 21వ తేదీన వరల్డ్ ఆల్జీమర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో ఆల్జీమర్స్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాకుండా నివారించడానికి చేసే చర్యలపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వరల్డ్ ఆల్జీమర్స్ డే సందర్భంగా ఆల్జీమర్స్ లక్షణాలను తొందరగా ఎలా గుర్తించాలో ఇక్కడ చూద్దాం.
రోజు వారి పనులు దెబ్బతింటాయి.
చిన్న చిన్న విషయాల దగ్గర నుండి పెద్దవాటి వరకు మర్చిపోతుంటారు. అందువల్ల ఊరికూరికే అడుగుతూ ఉంటారు. ఒక విషయాన్ని మాటి మాటికీ అడుగుతున్నారంటే జాగ్రత్త పడాలి. అలాగే మర్చిపోతున్నామన్న ఉద్దేశ్యంతో రాసుకునే అలవాటు చేసుకుంటారు.
వస్తువులను ఎక్కడ పెడతారో మర్చిపోతారు
ఒక్కసారి కాదు ప్రతీసారీ పెట్టిన వస్తువును ఒకే చోట పెట్టకుండా వివిధ రకాల స్థలాల్లో పెడుతుంటారు. కిచెన్లో వ్యాలెట్ పెట్టడం, బెడ్ పై నీళ్ళ గ్లాసు పెట్టడం సహా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు వస్తువులను పెడతారు. అదీగాక వాటిని వెదికి పట్టుకునే క్రమంలో ప్రతీసారి ఆవేశపడుతుంటారు.
ఆలోచనలను సరైన క్రమంలో పెట్టడంలో విఫలం అవుతారు
వారి ఆలోచనలు ఒక క్రమ పద్దతిలో కొనసాగవు. ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు అది కాకుండా ఇంకేటేదో గుర్తుకొస్తూఉంటుంది. దానివల్ల మొదటి ఆలోచన దెబ్బతింటుంది. అలా ప్రతీసారీ ఇబ్బంది పడతారు.
రోజు వారి పనులు కూడా భారంగా మారతాయి
రోజువారి పనులు చేయడం కష్టంగా అనిపిస్తుంటుంది. కాఫీ ఎలా చేయాలో మర్చిపోతారు. బట్టలు ఎలా తొడుక్కోవాలి? షూ లేస్ ఎలా ముడివేసుకోవాలి అన్న అంశాలు మర్చిపోతారు. దాంతో ఆ పనులు చేయడంలో కష్టపడతారు.
తేదీ మర్చిపోతారు
తేదీలు, వారాలు, రుతువులు మర్చిపోతారు. సడెన్ గా ఇప్పుడు ఏ కాలం నడుస్తుంది అంటే వారు చెప్పలేరు. వర్షాకాలమా? చలికాలమా అన్న కన్ఫ్యూజన్ లో ఇబ్బంది పడతారు.
భాషా సమస్య
చాలాసార్లు వస్తువులను ఏమని పలకాలో తెలియక కొత్త కొత్త పదాలు సృష్టిస్తారు. ఇది తరచుగా జరుగుతూ ఉంటే జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది.