వియత్నాంలో యాగి తుపాను బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షం, వేగంగా గాలులు వీస్తుండటంతో కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు సంభవించాయి. ఫలితంగా 141 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 59 మంది గల్లంతైనట్లు ఆ దేశ వ్యవసాయ,గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
మృతుల్లో 29 మంది కావో బ్యాంగ్ ప్రావిన్స్‌కు చెందిన వారు, 45 మంది లావో కై ప్రావిన్స్‌కు, 37 మంది యెన్ బాయి ప్రావిన్స్‌కు చెందినవారు ఉన్నట్లు సమాచారం.
అయితే, క్యూయెట్ థాంగ్ కమ్యూన్ గుండా ప్రవహించే డైక్ నదికి భారీ నీటి ప్రవాహం పోటెత్తడంతో వరద ముంచెత్తింది. ఈ విషయాన్ని తుయెన్ క్వాంగ్ ప్రావిన్స్ స్థానిక అధికారులు ధ్రువీకరించినట్లు వియత్నాం అధికారులు మీడియాకు పేర్కొన్నారు. రాజధాని హనోయిలోని ఎర్ర నదిపై వరద స్థాయి మూడో హెచ్చరికలను దాటాయి. బుధవారం మధ్యాహ్నానికి అత్యధిక స్థాయికి చేరుకుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటియరోలాజికల్ ఫోర్‌కాస్టింగ్ అంచనా వేసింది. అలాగే థావో నది నీటి మట్టం పెరిగి, దాని సమీప ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటియోరోలాజికల్ ఫోర్‌కాస్టింగ్ పేర్కొంది.ఉత్తరాదిలోని నదులపై వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది.