నగర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణశాఖ. విపరీతమైన ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబరు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరించింది. దాంతో, రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఈ రోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఇక రాబోయే ఏడు రోజులు రాష్ట్రమంతటా గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.