జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ద్విచక్ర వాహనాల షోరూం వద్ద జరిగిన ఘర్షణ యువకుడి ప్రాణం తీసింది.గణపురం మండల కేంద్రంలోని షోరూంలో గత పన్నెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఎన్ ఓ సి (no objection certificate) కోసం మండల కేంద్రానికి చెందిన పెండ్యాల ప్రశాంత్ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి యజమానిని అడిగాడు.ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.అనంతరం ప్రశాంత్ మరికొందరు యువకులతో కలిసి మరోసారి షోరూం వద్దకు వెళ్లి ఘర్షణకు దిగారు. దీంతో షోరూం యాజమాని పోలీసులకు ఫోన్ చేయడంతో షోరూం వద్ద ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రశాంత్ తో పాటు మరో యువకుడు శ్రావణ్ పై చేయి చేసుకోవడంతో మనస్తాపంతో ఏప్రిల్ 12వ తేదీన రాత్రి బండారుపల్లి ఏరియాలో ప్రశాంత్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.పరిస్థితి విషమించడంతో వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు.ఈ విషయమై పోలీసులు, షోరూం యజమాని వల్లేే మా కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని జిల్లా ఎస్పీకి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు.యువకుడి మృతితో కుటుంబంతో పాటు గణపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ప్రశాంత్ మృతికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.