వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న.. నియోజకవర్గం అభివృద్ధి నిధులకు ఎట్టకేలకు మోక్షం వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 151 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు గెలుపు గుర్రం ఎక్కారు. వీరిలో జగన్ తన సొంత నియోజకవర్గంతోపాటు… కడపజిల్లాను అభివృద్ది చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే.. కడపలోని పది నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే అనేక రూపాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. మిగిలిన 141 నియోజకవర్గాలతోపాటు.. ప్రతిపక్ష నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాల్సిఉంది.
దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం జగన్ ఓ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రతి నియోజకవర్గానికీ.. కోటి రూపాయలు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు.దీనికి సంబంధించి అసెంబ్లీలోనూ ప్రకటించారు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా.. ఇప్పటి వరకు ఈ నిధులను ఇవ్వలేక పోయారు. ఇక, ఇప్పుడు గత ఏడాది .. ప్రస్తుతం సంవత్సరం కలిపి.. మొత్తం రెండు కోట్ల రూపాయలను ఈ ఏడాది చివరి నాటికి రిలీజ్ చేయాలని ప్రణాళిక వేసుకున్నట్టు తెలిసింది.
ప్రతిపక్ష నేతల నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. సొంత నేతల నియోజకవర్గాలకు సంబంధించి.. నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు… గడిచిన ఆరు మాసాల్లో చేసిన పనులు, ప్రజలతో మమేకమైన తీరుపై నివేదికలు ఇవ్వాలని షరతు విధించినట్టు ప్రచారం జరుగుతోంది. అంటే.. గత ఏడాదిని పక్కన పెట్టినా.. ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం అనేక రూపాల్లో సాయాలు అందించింది. వీటిని సక్రమంగా అందించే బాధ్యతలను ఓ వైపు అధికారులకు అప్పగిస్తూనే.. మరోవైపు.. నేతలకు కూడా పర్యవేక్షణ బాధ్యతలు ఇచ్చారు.
ఈ క్రమంలో వారు ప్రజలకు ఎలా కనెక్ట్ అయ్యారు. తక్షణం ఆయా నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనులు ఏమిటి? అనే విషయాలపై జగన్ నివేదికలు కోరినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ నిధుల విషయంలో జగన్ భలే మెలిక పెట్టాడే అన్న టాక్ సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. వీటిలో సంతృప్తికరంగా ఉన్న నియోజకవర్గాలకు రూ. 2 కోట్లు, సాధారణ సమస్యలు ఉన్న వాటికి రూ.కోటి ఇవ్వనున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
-vuyyuru subhash