అధికార పార్టీ అంటే అందరికీ మోజు ఉంటుంది. అధికార పార్టీలో ఉన్నా, చేరినా ఆ దర్జానే వేరు. అందుకే సహజంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీలోకి పెద్దఎత్తున ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తూ ఉంటారు. ఇది సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియ. గత టిడిపి ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున వైసిపి నాయకులు, ఇతర పార్టీలకు చెందిన వారు టిడిపిలో చేరిపోయారు. కొంత మంది ఎమ్మెల్యేలు అదే బాట పట్టడం, వారికి కీలకమైన మంత్రి పదవులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయి. వారే కాకుండా నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు. కేవలం తమకు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తున్నామనే లెక్కల్లోనే టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టి, పెద్ద ఎత్తున నాయకులను తమ పార్టీలో చేర్చుకుంది.
చివరకు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లేని విధంగా ఫలితాలను చవి చూస్తోంది. కేవలం 23 సీట్లతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసలు దీనంతటికీ కారణం ప్రజా వ్యతిరేక విధానాలు ఒక ఎత్తయితే, ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చి చేరిన నాయకుల కారణంగా, ముందు నుంచి టిడిపిలో ఉంటూ, టిడిపి భావజాలన్ని భుజాన ఎత్తుకున్న వారికి మధ్య సఖ్యత లేకపోవడం, గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలు ఇలా అనేక కారణాలతో తెలుగుదేశం పార్టీ బొక్క బోర్లా పడాల్సి వచ్చింది. ఈ విషయం జగన్ కు తెలియంది కాదు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉంది.
సహజంగా అధికార పార్టీ కావడంతో పెద్ద ఎత్తున టిడిపి నుంచి నాయకులు వైసీపీలోకి వలసబాట పట్టారు. మొదట్లో ఈ విషయంలో జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం ద్వారా, ప్రస్తుతం ఉన్న వైసీపీ నాయకులకు మధ్య గ్రూప్ రాజకీయాలు మొదలవుతాయని, ఇది పార్టీ ఉనికిని దెబ్బతీస్తుందని జగన్ అభిప్రాయపడడంతో చేరికలకు ఆచితూచి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండేవారు. అయితే కొద్ది రోజులుగా జగన్ వ్యవహారశైలి చూస్తుంటే, టిడిపిని మరింతగా బలహీనం చేసి, వచ్చే ఎన్నికల నాటికి కనుమరుగు చేయాలనే అభిప్రాయంలో జగన్ ఉండడంతో, ఇప్పుడు పెద్దఎత్తున టిడిపి బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవడమే కాకుండా, జిల్లాల వారీగా నాయకులను ఆహ్వానిస్తూ, పార్టీ కండువాలు కప్పుతున్నారు.
తాజాగా కాకినాడకు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు, గతంలో టిడిపి ప్రజారాజ్యం వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన చలమలశెట్టి సునీల్ ను జగన్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనే కాదు ఇంకా అనేక మంది కీలక నాయకులను వైసీపీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో టిడిపి ఏ విధంగా అయితే చేరికల విషయంలో తప్పటడుగు వేసేందో ఇప్పుడు అదే విధంగా జగన్ తప్పటడుగులు వేస్తున్నారు అనేది పార్టీ నాయకుల అభిప్రాయం. ఇప్పటికే మొదటి నుంచి వైసీపీని నమ్ముకున్న నాయకులకు పదవులు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.