అమరావతి రైతుల కోసం తన పోరాటాన్ని పెద్ద ఎత్తున చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఇందులో భాగంగా ఆయన రోజుకో పోరాటం చేసే విధంగా సిద్దమవుతున్నారు. అమరావతి కోసం 13 జిల్లాల్లో బస్ యాత్ర చేసేందుకు కూడా చంద్రబాబు సిద్దమయ్యారు. అయితే అనూహ్యంగా పరిస్థితులు మారడం, ప్రభుత్వం బస్సులను సీజ్ చేయడంతో చంద్రబాబు ఆగిపోయారు.
బుధవారం సాయంత్ర౦ ఒక ఆసక్తికర సంఘటన విజయవాడ బెంజ్ సర్కిల్ లో జరిగింది. ఆయన పాదయాత్రగా ఆటోనగర్ వరకు వెళ్లాలని భావించినా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో రోడ్డుపైనే చంద్రబాబు బైటాయించి తన నిరసన తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబుతో పాటుగా జెఎసి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్ లో ఎక్కించారు. దీనితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇక ఇప్పుడు రెండు ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. 2017 లో పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చిన ప్రత్యేక హోదా ఉద్యమానికి జగన్ విశాఖ వెళ్ళారు. ఆ రోజు విమానాశ్రయంలోనే ఆయన్ను అధికారులు అడ్డుకున్నారు. దీనితో జగన్ విమానాశ్రయం రన్ వే వద్ద బైటాయించారు. అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి జగన్ ని రోడ్డు మీద కూర్చోబెడితే ఇప్పుడు జగన్ అదే చేసారని కామెంట్ చేస్తున్నారు.