పాదయాత్ర సందర్భంగా యువ నాయకులు, అప్పట్లో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారు. 2019లో ఆంధ్రావనికి ముఖ్యమంంత్రిగా పాలన పగ్గాలు అందుకున్నాక, పదవీ బాధ్యతలు స్వీకరించాక ఆ హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని సంబంధిత నాయకులు నిర్థారిస్తూ ఉన్నారు. అందులో 95 శాతం హామీల అమలు చేశాం అని చెబుతున్నారాయన. కోనసీమ వాకిట మురమళ్ల గ్రామంలో నిన్నటి వేళ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 109కోట్ల రూపాయలు విడుదల చేశారు. అనంతరం ఇక్కడి వేల జనం మధ్య నిర్వహించిన బహిరంగ సభలో భాగంగా ఆ రోజు తానేం చెప్పానో అన్నది గుర్తుకు తెస్తూ, వాగ్దాన భంగం తాను చేయనని పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చారు. చేసిన మంచిని మాత్రమే తాను చెబుతున్నానని కూడా అంటూ వేల ప్రజానీకంలో విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా ఆ రోజు మత్స్యకారులకు వేట నిషేధ వేళ నాలుగు వేల రూపాయలే అందేదని, తాను అధికారంలోకి వచ్చేక ఆ మొత్తాన్ని పదివేలకు పెంచానని, అదేవిధంగా మత్స్యకారులకు ఎన్నోఆర్థిక ప్రయోజనాలు దక్కేందుకు కృషి చేశామని గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యమంత్రి మాటలకు మద్దతునిస్తూ మంత్రులు సీదిరి అప్పల్రాజు, చెల్లుబోయిన వేణు మాట్లాడారు.
ముఖ్యంగా ప్రతిపక్షాల అతి ప్రచారం కానీ చెడు ప్రచారం కానీ నమ్మవద్దని పదే పదే విన్నవించారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఇప్పటిదాకా 32 పథకాల ద్వారా నేరు ఆర్ధిక లబ్ధి చేసిన లేదా చేకూర్చిన ఘనత తమకే ఉందని కూడా అంటున్నారు. సంక్షేమం అన్నది నిరంతరం సాగే ప్రక్రియ అన్న అర్థం వచ్చేలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి మరో మారు తన విధినీ విధానాన్నీ విశదీకరించే లేదా వివరించే ప్రయత్నం చేసి ఆకట్టుకున్నారు. మంచి చేశానని చెప్పే నైతికత తనకు మాత్రమే ఉందని స్పష్టం చేస్తూ మరో మారు కొత్త విశ్వాసం కొత్త ఉత్సాహం జనంలో నింపే ప్రయత్నం ఒకటి చేశారు.