ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పక్కన బలమైన నేతలు లేకుండా వరసగా ఒక్కో కొమ్మ నరుక్కుంటూ వస్తున్నారు. మనకు బలం అయినా కాకపోయినా చంద్రబాబుకు బలం కాకూడదు అన్న సిద్ధాంతంతో ముందుకు వెళుతోన్న జగన్ ఇప్పటికే టీడీపీకి చెందిన 15 మంది కీలక నేతలను తన వైపునకు తిప్పేసుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన పలువురు నేతలు ఇప్పటికే వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం ఫ్యాన్ గూటికి చేరిపోయారు.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అధికారికంగా వైసీపీలో చేరకపోయినా జగన్ చెంతే ఉంటున్నారు. వీరిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం ఇద్దరూ కమ్మ ఎమ్మెల్యేలు. ఇక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు వైశ్య వర్గానికి చెందిన ఎమ్మెల్యే. ఈ క్రమంలోనే జగన్ ప్రస్తుతం చంద్రబాబు చెంతనే ఉన్న మరో ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలను కూడా టీడీపీకి దూరం చేస్తే టీడీపీ కూసాలు కదిలిపోయినట్లవుతుందని భావిస్తున్నారు. వీరిలో విశాఖలో బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో పాటు ప్రకాశం జిల్లాలో ఓటమి లేకుండా వరుస విజయాలు సాధిస్తోన్న గొట్టపాటి రవికుమార్.
విశాఖలో నలుగురు ఎమ్మెల్యేల్లో వెలగపూడి మినహా మిగిలిన ఎమ్మెల్యేలు టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. మాస్‌లో బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న వెలగపూడిని కూడా టీడీపీకి దూరం చేస్తే కొత్త రాజధానిలో అసలు టీడీపీకి నాయకుడే ఉండడని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. అయితే అక్కడ వెలగపూడిని పార్టీలో చేర్చుకునేందుకు కొందరు ఒప్పుకోకపోవడంతో చర్చలు నడుస్తున్నాయి. ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గతంలో వైసీపీ నుంచే గెలిచి ఆ తర్వాత టీడీపీ చెంత చేరారు.
రవి అవసరం అయితే ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు అందరికి డబ్బులు సమకూర్చే సత్తా ఉన్న నేత. జిల్లాకే చెందిన మంత్రి బాలినేనికి అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే రవి ఆదాయ వనరులు అయిన గ్రానైట్ కంపెనీల లీజు రద్దు చేస్తూ షాక్ ఇచ్చింది. రవిని పార్టీలో చేర్చుకునే ప్రక్రియలో భాగంగానే ఈ ఎత్తుగడలు అని చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఈ ఇద్దరు కమ్మ నేతలను కూడా టీడీపీకి దూరం చేస్తే బాబుకు పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి.