కరోనా తీసుకువచ్చిన పెనుమార్పుల్లో జూమ్ మీటింగ్ ఒకటి. పనులన్నీ ఇంటి నుండే జరుగుతున్నందున మీటింగులన్నీ ఆన్ లైన్లో అవుతున్నాయి. కంప్యూటర్ల ముందు ముఖాలు ఉంచి గంటలపాటు దానికే అతుక్కుని ఉండడం వల్ల ఈ అలసత్వం మొదలైంది. ఎక్కువ కాలం కంప్యూటర్ తెర ముందు గడపడం వల్ల అలసిపోతున్నారు. ఐతే ఈ అలసత్వం పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం వెల్లడి చేసింది. పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ మంది ఆన్ లైన్ అలసత్వం కారణంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది.
మరి దీనికి కారణలేంటనేది తెలుసుకుని, దాన్నుండి ఎలా బయటపడాలో చూద్దాం. నాలుగు గోడల మధ్య కూర్చుని ఎక్కడో ఉన్న కంపెనీ కోసం పనిచేయడం కొద్ది రోజుల వరకూ బాగానే సాగింది. కానీ రోజులు ఎక్కువవుతున్న కొద్దీ అది అలసటకి దారి తీసింది. ఒకే దగ్గర కూర్చోవడం, బయటకి వెళ్ళే అవకాశం లేకపోవడం, కాఫీ కబుర్లు లేక సమస్యలన్నీ సెల్ ఫోన్ల ద్వారా సాల్వ్ చేసుకుంటూ, మనుషులకి దూరంగా ఉండడమే దీనికి కారణం అంటున్నారు. ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు మధ్యలో వచ్చే బ్రేకులు, సహోద్యోగులతో పిచ్చాపాటీ కబుర్లు, పని భారాన్ని కొంతమేర తగ్గించేవి.
ప్రస్తుతం అవన్నీ లేకపోవడంతో పనిభారం విపరీతంగా పెరిగింది. అదీగాక కొంత మందికి ఇంట్లో అన్ని సౌకర్యాలు లేకపోవడం, ప్రత్యేకమైన గది, ఇంటర్నెట్ సౌకర్యం మొదలగు వాటివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనివల్లే అలసట మరింత పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది. మరి దీన్నుండి బయటపడడానికి వర్క్ మధ్యలో లేస్తూ ఉండడం, పనికి ఏమాత్రం సంబంధం లేని పుస్తకాలని చదవడం చేయడం వల్ల భారం తగ్గినట్లు అనిపించి అలసత్వాన్ని దూరం చేసుకోవచ్చని తెలిపారు.