రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ ద్వారా సమావేశం కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నేతలు ప్రజాసమస్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ పాదయాత్ర ఎఫెక్ట్, భవిష్యత్ కార్యాచరణపైనా చర్చలు చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కోవడంపై కూడా చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని పీసీసీ ఇప్పటికే భావిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. దానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఏఐసీసీ అనుమతి కోసం రేవంత్ ఎదురుచూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
రేవంత్ పాదయాత్రలో ఒక్కరే ఉంటారా..? మిగతా నేతలు కూడా భాగస్వాములవుతారా…? అనే అంశంపై, అనుమతి వస్తే ఎప్పుడు, ఎక్కడి నుండి మొదలుపెట్టాలి అని కూడా ఈ సమావేశంలో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మర్రి శశిధర్ రెడ్డి అమిత్ షాను కలిసిన విషయంపై, పార్టీ మారకుండా ఆయనకు బుజ్జగింపులు చేపట్టనున్నట్టు సమాచారం. మర్రి శశిధర్ రెడ్డి బాటలోనే మరికొందరు సీనియర్ నేతలు ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా అన్ని విషయాలపైనా హస్తం నేతలు డిస్కస్ చేయనున్నారు. అయితే మునుగోడు రిజల్ట్ తర్వాత మొదటిసారి నేతలు సమావేశం కానుండడంతో కాంగ్రెస్ నేతల్లో ఆసక్తి నెలకొంది.