కరోనా వైరస్‌కు గాను ప్రస్తుతం భిన్న రకాల మెడిసిన్లను వైద్యులు రోగులకు ఇస్తున్నారు. రోగుల ఆరోగ్య స్థితి, అనారోగ్య సమస్యలు, ఇతర లక్షణాలను బట్టి పలు రకాల మెడిసిన్లతో కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే కోవిడ్ ప్రారంభమైన తొలి దశలో ఓసీడీ (obsessive-compulsive disorder) మెడిసిన్ అయిన ఫ్లువోగ్జామిన్‌తో చికిత్స అందిస్తే కోవిడ్ రోగులకు ప్రాణాపాయ స్థితి తప్పుతుందని, హాస్పిటల్‌లో చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అలాగే ఊపిరితిత్తులు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు గురి కాకుండా ఉంటాయని సైంటిస్టులు తేల్చారు.
సైంటిస్టులు పై పరిశోధనలకు చెందిన వివరాలను జామా అనే జర్నల్‌లో ప్రచురించారు. కోవిడ్ ఉందని నిర్దారణ అయిన పేషెంట్లు 80 మందికి తొలి దశలో యాంటీ డిప్రెస్సెంట్ ఫ్లువోగ్జామిన్‌ను ఇచ్చారు. దీంతో వారిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గిందని నిర్దారించారు. సాధారణంగా ఫ్లువోగ్జామిన్ ను ఓసీడీ ఉన్న రోగులకు ఇస్తారు. దీంతో వారికి ఓసీడీ తగ్గుతుంది. మానసిక సమస్యలు ఉన్న వారికి కూడా ఈ మెడిసిన్‌ను ఇస్తుంటారు.
అయితే ఫ్లువోగ్జామిన్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయని, అందువల్లే కోవిడ్ రోగులకు ఆరంభంలో ఆ మెడిసిన్‌ను ఇస్తే వారు త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మెడిసిన్‌పై పెద్ద ఎత్తున ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యులు కోవిడ్ రోగులకు ఆరంభంలో ఈ మెడిసిన్‌ను ఇస్తే వారు ప్రాణాపాయ స్థితికి చేరుకోకుండా ఉంటారని, హాస్పిటల్‌లో చికిత్స పొందాల్సిన అవసరం రాదని తెలిపారు. దీనిపై త్వరలో మరిన్ని పరిశోధనలు చేయనున్నట్లు వెల్లడించారు.