మ‌రోసారి వివాదంలో ఇరుక్కున్న యాపిల్‌.. ఐఫోన్ 12 ఫోన్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను త‌గ్గిస్తుందంటూ ఫిర్యాదు..

టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ మ‌రోమారు వివాదంలో ఇరుక్కుంది. ఐఫోన్ 12 ఫోన్ల ( IPhone 12 phones ) ప్ర‌ద‌ర్శ‌న‌ను త‌గ్గిస్తుందని, దీంతో ఆ ఫోన్లు నెమ్మ‌దిగా ప‌నిచేస్తున్నాయ‌ని, యాపిల్ కావాల‌నే ఇలా చేస్తుంద‌ని ఆరోపిస్తూ స్పెయిన్‌కు చెందిన క‌న్‌జ్యూమ‌ర్ ప్రొటెక్ష‌న్ ఆర్గ‌నైజేష‌న్ ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు ఆ సంస్థ యాపిల్‌కు ఓ లేఖ పంపింది. దీనిపై వెంట‌నే యాపిల్ స్పందించాల‌ని, లేదంటే పెద్ద ఎత్తున ప‌రిహారం కోరుతూ లా సూట్ వేస్తామ‌ని హెచ్చ‌రించింది.

 

Iphone 12 Phone
Iphone 12 Phone | ఐఫోన్ 12 ఫోన్ల

ఇక స‌ద‌రు సంస్థ‌కు ఇంకొన్ని సంస్థ‌లు జ‌త క‌లిశాయి. స్పెయిన్‌కు చెందిన Altroconsumo, Deco Proteste, Test-Achats అనే సంస్థ‌లు కూడా ఇదే విష‌య‌మై క‌న్‌జ్యూమ‌ర్ ప్రొటెక్ష‌న్ ఆర్గ‌నైజేష‌న్ కు మ‌ద్దతుగా నిలిచాయి. యాపిల్ విడుద‌ల చేసిన ఐఓఎస్ అప్‌డేట్స్ అయిన iOS 14.5, iOS 14.5. 1, iOS 14.6 ల కార‌ణంగా ఐఫోన్ 12 ఫోన్ల ప్ర‌ద‌ర్శ‌న నెమ్మ‌దించింద‌ని, దీంతో ఆ ఫోన్లు కొంత నెమ్మ‌దిగా ప‌నిచేస్తున్నాయ‌ని ఆ సంస్థ‌లు తెలిపాయి.

అయితే ఇది యాపిల్‌కు కొత్తేమీ కాదు. గ‌తంలో 2016లో ఐఫోన్ 6 ఫోన్ల విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింది. ఆ ఫోన్ల బ్యాట‌రీ హెల్త్‌ను మెరుగు ప‌రుస్తున్నామ‌ని చెబుతూ ఐఓఎస్ అప్‌డేట్స్ ద్వారా ఫోన్ల ప్ర‌ద‌ర్శ‌నను నెమ్మ‌దింప‌జేసింది. దీంతో ఆయా ఫోన్లు బాగా స్లో అయ్యాయి. దీనిపై వినియోగ‌దారులు భగ్గుమ‌న్నారు. యాపిల్‌పై లా సూట్ వేశారు. దీంతో యాపిల్ త‌ప్పు ఒప్పుకుని భారీ ఎత్తున న‌ష్ట‌ప‌రిహారం చెల్లించింది. స‌ద‌రు వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌ల‌కే బ్యాట‌రీల‌ను అందించింది. అలాగే అప్‌డేట్ ద్వారా ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించింది.

అయితే సరిగ్గా ఇప్పుడు ఐఫోన్ 12 ఫోన్ల విష‌యంలోనూ యాపిల్ ఇలాగే చేస్తుంద‌ని స‌ద‌రు సంస్థ‌లు ఆరోపిస్తున్నాయి. దీనిపై వెంట‌నే స్పందించ‌క‌పోతే భారీ ఎత్తున న‌ష్ట‌ప‌రిహారం డిమాండ్ చేస్తూ లా సూట్ వేస్తామ‌ని ఆ సంస్థ‌లు యాపిల్‌ను హెచ్చ‌రించాయి. మ‌రి యాపిల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.