చాలా పనుంది.. 24/7 పని చేస్తున్నా : ఎలాన్ మస్క్

ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ ఆ కంపెనీలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆదాయం పెంచుకోవడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందరూ కష్టపడి పనిచేయాలని.. అలాగైతేనే కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఉద్యోగులకు సూచించారు. రోజుకి 12 గంటల వరకు పనిచేయాలని కోరారు. అయితే, వారికి చెప్పడమే కాదు.. తానూ కష్టపడి పనిచేస్తున్నానంటున్నారు.

బాలిలో జరగనున్న జీ20 సదస్సు నేపథ్యంలో అక్కడ జరిగిన ఓ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ కోసం మాట్లాడుతూ.. తన చేతిలో ఇప్పుడు చాలా పని ఉందని చెప్పారు మస్క్. వారంలో ఏడు రోజులు.. ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పనిచేస్తున్నట్లు మస్క్‌ తెలిపారు. టెస్లాకు కూడా సీఈఓగా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్‌.. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ట్విటర్‌ కోసమే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టెస్లా షేర్‌హోల్డర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. మస్క్‌ ట్విటర్‌ ధ్యాసలో పడి టెస్లాను ఏమైనా నిర్లక్ష్యం చేస్తారేమోనని ఇన్వెస్టర్లు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు బాలిలో జీ20 సదస్సులో టెస్లా, స్పేస్‌ఎక్స్‌తో ఇండోనేసియా పలు ఒప్పందాలు చేసుకునే యోచనలో ఉంది.