ఎన్నో అవస్థలు దాటి అధికారంలోకి వచ్చిన వైసీపీ కొన్ని తప్పిదాలను పదే పదే చేస్తోంది..వాటిని దిద్దుకోలేక ఇరకాటంలో పడుతోంది..అని అంటోంది టీడీపీ. మహానాడుకు సంబంధించి ఆ పార్టీ నడుచుకున్న పద్ధతి కానీ పోలీసులు నడుచుకున్న పద్ధతి కానీ ఏం బాలేదని, ఇవన్నీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అని అంటోంది. ప్రజా స్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ, సభ పెట్టుకునే స్వేచ్ఛ ఉన్నాయని వీటిని ఎవ్వరూ కాదనలేరు అని, అడ్డుకోవడం కానీ నిలువరించడం కానీ, లేదా నిబంధనల మేరకు సహకరించకపోవడం కానీ తగవని చెబుతోంది.
ఇంకా చెప్పాలంటే…
అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధం కామన్. కానీ యుద్ధం ఇప్పుడే మొదలయింది అని, ఎన్నికల యుద్ధం ఇప్పటి నుంచే చేయనున్నామని మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించారు. దీంతో వైసీపీ కూడా సై అంటే సై అంటోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తామే గెలుస్తామని చెబుతూనే, మహానాడు నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఏ విధంగా ప్రవర్తించిందో చెప్పేందుకు, అందుకు తగ్గ ఆధారాలు అన్నీ వెల్లడి చేసేందుకు సిద్ధం అవుతోంది. దీంతో యుద్ధం ఆరంభమే తీవ్ర స్థాయిలో ఉంది. మరి! అంతం ఎప్పుడవుతుందో ?
మంత్రి గారికో న్యాయం మాకో న్యాయం
మహానాడుకు సంబంధించి ఇప్పుడొక వివాదం నడుస్తోంది. తాము డబ్బులు కడతామన్నా ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ప్రయివేటు వాహనాలు అంటే స్కూల్ బస్సులు కూడా వద్దన్నారని, వాటిని కూడా ఆర్టీఓ అధికారులు అడ్డుకున్నారని టీడీపీ అంటోంది. ఇదే సమయంలో మంత్రుల బస్సు యాత్రకు సంబంధించి సంబంధిత సభలకు వెళ్లేందుకు ఓ కార్పొరేట్ స్కూల్ కం కాలేజ్ బస్సులు వాడుకున్నారని, ఆధారాలతో సహా టీడీపీ మాట్లాడుతోంది. తమకో న్యాయం, అధికార పక్షంకో న్యాయమా అని నిలదీస్తోంది. ఇప్పుడిదే అంతటా చర్చనీయాంశం అవుతోంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజనీకి ఏ విధంగా ప్రయివేటు స్కూలు బస్సులు కేటాయించారు అంటూ మండిపడుతోంది.
అణిచివేతలను ఎదుర్కొంటాం
మరోవైపు మహానాడుకు సంబంధించి ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికి వచ్చామని, సభ సక్సెస్ కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడమే ధ్యేయంగా తామంతా పనిచేస్తున్నామని అంటున్నాయి. పాలక పక్షం అణచివేతలను దాటుకుని తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాయి.