ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తన చందాదారులకు శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్‌కు చెందిన ఈడీఎల్ఐ స్కీమ్‌లో భాగంగా అందిస్తున్న డెత్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచింది. ఇప్పటి వరకు ఈ ఇన్సూరెన్స్ కింద రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కవరేజీని అందించేవారు. దాన్ని రూ.2.50 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో ఒక ప్రకటనలో తెలిపింది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మస్‌లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 ప్రకారం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈడీఎల్ఐ)ని ఈపీఎఫ్‌వో చందాదారులకు అందిస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్ ప్రైవేటు సెక్టార్‌కు చెందిన వేతన జీవులకు వర్తిస్తుంది.
ఈ స్కీమ్ కింద నెలకు రూ.15వేల వరకు బేసిక్ శాలరీని తీసుకునే వారు అర్హులు. వారు ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఇన్సూరెన్స్‌ను పొందుతారు. ఈ క్రమంలోనే సంస్థలు ఉద్యోగుల బేసిక్ శాలరీ నుంచి 0.5 శాతాన్ని లేదా గరిష్టంగా నెలకు ఒక ఉద్యోగికి రూ.75 చొప్పున ప్రీమియం చెల్లించాలి. దీంతో ఆ ఉద్యోగులకు ఈడీఎల్ఐ స్కీమ్ వర్తిస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగులు చనిపోయినప్పుడు వారి నామినీలు లేదా కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ మొత్తం లభిస్తుంది. వారు చెల్లించిన ప్రీమియంను బట్టి రూ.2.50 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు.