“కమ్మ కులంలో పుట్టడమే మేం చేసిన పాపమా? మేం చేసిన తప్పా?!“-ఇదీ.. కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అడిగిన ప్రశ్న. సీఎం జగన్.. కొన్నాళ్లుగా కమ్మలను టార్గెట్ చేస్తున్నారని, కమ్మ వర్గానికి చెందిన వారిపై కేసులు పెడుతున్నారని, అసలు కమ్మ కులం అంటేనే జగన్ జీర్ణించుకోలేక పోతున్నారని ఈ ప్రశ్నలో అంతరార్థం స్పష్టంగా కనిపిస్తోంది. వైవీబీ బాగానే స్పందించారు. ఎవరికీ రాని సందేహం.. ఆయనకు వచ్చింది. బహుశ ఆయన కూడా కమ్మ కులానికి చెందిన నాయకుడే కావడం కావొచ్చు…!
అయితే, వైవీబీ ప్రశ్న.. జగన్‌కేమోకానీ.. సొంత పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. కమ్మ కులం గురించి.. వైవీబీ మాట్లాడడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పోయి పోయి.. ఇప్పుడు కమ్మ గురించి మనమే కెలుక్కున్నట్టుగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు తమ్ముళ్లు నేరుగా అనకపోయినా.. పరోక్షంగా మాత్రం కమ్మగా పుట్టడం తప్పని ఎవరు అన్నారు సార్.. కుట్ర రాజకీయాలు చేస్తున్నారని కదా అధికార పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తోంది. దీనిని టార్గెట్ చేయడం మానేసి మీరు.. ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? అని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి వైఎస్సార్ సీపీ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులపై తమకు ఏమీ కోపం లేదని, కానీ, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్న కమ్మ నేతలపైనే తమకు ఆగ్రహమని ఆఫ్‌ది రికార్డుగా వారు కూడా చెబుతున్నారు. కమ్మగా పుట్టాలని ఎవరూ కోరుకోరు.. అయితే.. కుట్రలు మాత్రం కోరుకుంటారా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
వైవీబీ సంచలన వ్యాఖ్యలు చేయాలని అనుకున్నారో.. లేక.. తాను సంచలనంగా మారాలని అనుకున్నారో.. తెలియదు కానీ.. కమ్మ వర్గంపై చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశం కావడం, దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలనే డిమాండ్లు వస్తుండడం మరింత ఇరకాటంలోకి నెట్టిందనే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు.