తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 2018 ముందస్తు ఎన్నికల ముందు నుంచే కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలతో రాజకీయం చేద్దామని అనుకున్నారు. పైగా 2018 ఎన్నికల్లో భారీగా అసెంబ్లీ సీట్లు గెలిచి రెండోసారి సీఎం పీఠంలో కూర్చున్న కేసీఆర్..2019 పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిద్దామని అనుకున్నారు. ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా పలు ప్రాంతీయ పార్టీల అధినేతలని కలిసి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో కీలకంగా ఉందామని భావించారు. ముఖ్యంగా కేసీఆర్, జగన్‌ని తన గ్రిప్‌లో పెట్టుకున్నారు.
కేంద్రంలో తాను ఎటు వెళితే జగన్‌ని అటు తీసుకెళ్దామని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ భారీగా సీట్లు దక్కించుకుని వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇదే సమయంలో టీఆర్ఎస్, వైసీపీలు ఎక్కువగానే ఎంపీ సీట్లు గెలుచుకున్నా, పెద్ద ఉపయోగం లేకుండాపోయింది. ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. ఏపీలో జగన్‌కు 22 ఎంపీ సీట్లు వచ్చినా.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ కారు బోల్తా పడి కేవలం 9 సీట్లతో సరిపెట్టుకుంది.
దీంతో ప్రస్తుతం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేసి ముందుకెళుతున్నారు. అయితే కేంద్రంలో చక్రం తిప్పాలనే ఆలోచన కేసీఆర్‌కు పోలేదని, ఆయన మళ్ళీ కేంద్రం వైపు వెళ్ళడం ఖాయమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇక్కడ సీఎం పీఠంలో కేటీఆర్‌ని కూర్చోపెట్టి, కేంద్రంలో చక్రం తిప్పాలనేదే కేసీఆర్ వ్యూహామని అంటున్నారు. కాకపోతే కేసీఆర్ అవకాశాన్ని బట్టి ముందుకుపోతారని, నెక్స్ట్ కూడా మోడీ హవా ఉంటే, జగన్‌ని పట్టుకుని బీజేపీకి సపోర్ట్ ఇస్తారని, ఒకవేళ ఆ ఛాన్స్ లేకపోతే దేశంలో ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీలని కలుపుకుని హడావిడి చేయడానికి చూస్తారని అంటున్నారు.
ఇక అప్పుడు కూడా జగన్‌ని కేసీఆర్ వాడుకుంటారని, కానీ కేసీఆర్ కేంద్రంలో పొడిచేది ఏం ఉండదని రేవంత్ గట్టిగానే చెబుతున్నారు. కానీ మొత్తానికైతే కేసీఆర్ ఆడే రాజక్రీయ క్రీడలో మాత్రం జగన్ ఒక ఆటగాడు గానే ఉంటారని అంటున్నారు.