‘కారు’ని ఢీ కొట్టబోతున్న’ బండి ‘ ? గ్రేటర్ ప్లాన్ ఇదే ?

-

జీహెచ్ఎంసి ఎన్నికలను అధికార పార్టీ టిఆర్ఎస్ తో పాటు, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ వందకుపైగా స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతోనే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసిపై పూర్తిగా దృష్టి సారించారు. అధికార పార్టీ పట్టు ఎక్కడా, చేజారిపోకుండా పూర్తిగా ఎన్నికలపై దృష్టి పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో పాటు, తరచుగా పార్టీ కీలక నాయకులదరితోనూ సమావేశాలు నిర్వహిస్తూ, హడావుడి చేస్తున్నారు. ఇక ఇదే జిహెచ్ఎంసి పై బిజెపి కూడా కన్నేసింది. ఈ ఎన్నికల్లో పట్టు సాధించగలిగితే, 2023 అసెంబ్లీ ఎన్నికలలోనూ సులభంగా గెలవవచ్చు అనే అభిప్రాయంతో బిజెపి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్లో పట్టు చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.

bandi sanjay
bandi sanjay

గ్రేటర్లో పార్టీని బలోపేతం చేసేందుకు గాను, ఆరు జిల్లాలుగా విభజించి కొత్త అధ్యక్షులను ఆయన నియమించారు. డివిజన్ల వారీగా పట్టు పెంచుకునేందుకు ప్రజా సమస్యలపై స్పందించేందుకు, కొత్త అధ్యక్షులను సంజయ్ నియమించారు. మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో 150 డివిజన్లు ఉండగా, అందులో బిజెపికి నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పుడు 80  కి తగ్గకుండా డివిజన్లను సాధించగలిగితే టిఆర్ఎస్ పార్టీపై పట్టు సాధించవచ్చని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగర వేయవచ్చు అనే అభిప్రాయంతో బండి సంజయ్ ఉన్నారు. గ్రేటర్ లో బిజెపికి పట్టు ఎక్కువగా ఉండడం, అలాగే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, ఎంపీ ఉండడం ఇవన్నీ కలిసి వస్తాయని బిజెపి అంచనా వేస్తోంది.

ఇక టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ నిత్యం డివిజన్లలో పర్యటిస్తూ, అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ, పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో టిఆర్ఎస్ హవా ఎక్కడా కనిపించకుండా బిజెపి బలం పెరిగేలా బండి సంజయ్ ప్లాన్ చేసారు. ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. 150 డివిజన్లలోనూ సంజయ్ పర్యటించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే 150 డివిజన్ ల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సమగ్రంగా సర్వే కూడా నిర్వహించి అప్పుడు టికెట్లు కేటాయించాలని చూస్తున్నారు. ఈ మేరకు ఒక్కో డివిజన్ నుంచి ఇద్దరు ముగ్గురు పేర్లను పరిగణలోకి తీసుకుని, వారిలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

అదీ కాకుండా టిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి నాయకులను బీజేపీ లోకి తీసుకు వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా ఉద్యమాలు, అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్ తో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం, ఇలా అనేక విషయాల్లో బిజెపిపై జనాల్లో ఆదరణ మరింత పెరిగిందని సంజయ్ బలంగా నమ్ముతున్నారు . అయితే మెల్లిమెల్లిగా గ్రేటర్ పరిధిలో బిజెపి పట్టు  పెంచుకుంటూ వస్తుండడం టిఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోంది.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news