రాజకీయాల్లో పార్టీలకు అనేక వ్యూహాలు ఉంటాయి. ఒక పార్టీ ఒక రాష్ట్రంలో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు.. అదే పార్టీతో పోరుగు రాష్ట్రంలో విభేదించనూ వచ్చు. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అవకాశం-అవసరం అనే రెండు కోణాలే రాజకీయాల్లో ప్రధానంగా పనిచేస్తాయి. గతంలో 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్‌తో కలిసి మెలిసి పోటీ చేసిన టీడీపీ.. ఏపీ విషయానికి వస్తే.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీని పక్కకు కూడా చేరనీయలేదు. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. అయితే, ఇప్పుడు నిజాయితీకి, నిబద్ధతకు తాను ప్రతిరూపం అంటూ డైలాగులు చెప్పే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ జాబితాలోనే చేరిపోయారని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లను బట్టి.. త్వరలోనే జరగనున్న తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో జనసేన అక్కడి అధికార పార్టీ టీఆర్ ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీతో పొత్తును కొనసాగిస్తున్నారు. ఏపీలో అయితే, బీజేపీ నేతలతోకలిసి పోరాటాలు, ఉద్యమాలు కూడా చేస్తున్నారు.కానీ, రాష్ట్రం మారేసరికి వ్యూహాలు కూడా మారిపోతున్నాయా? అనే సందేహం వచ్చేలా వ్యవహరిస్తున్నారట పవన్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గత ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు కూడా అదే విజయాన్ని సొంతం చేసుకునేందుకు టీఆర్ ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.
కానీ, రెండో సారి అధికారంలోకి వచ్చినా.. హైదరాబాద్‌లో నీటి కష్టాలు, మురుగునీటి బాధలు తీరలేదు. చిన్న వర్షం కురిస్తేనే.. రోడ్లు మునిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఇటీవల డ్రైనేజీలో పడి ఓ చిన్నారి, ఓ యువకుడు కొట్టుకుపోయి మృతి చెందిన ఘటనలు తీవ్ర వివాదం అయ్యాయి. దీంతో ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ.. విపక్షాలు, ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికితోడు పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. మరోవైపు.. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను దోచేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆగ్రహం ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ వచ్చే అవకాశం లేదని టీఆర్ ఎస్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఓట్లను చీల్చే వ్యూహం పన్నిందనే వ్యాఖ్యలు విశ్లేషకుల నుంచి వినిపిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే జనసేనతో టీఆర్ ఎస్ లోపాయికారీగా ఒప్పందం చేసుకుని, దాదాపు 40 స్థానాల్లో టీఆర్ ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి.. అక్కడ జనసేనకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. ఆయా స్థానాలు ఏపీ మూలాలున్న ప్రజలు ఎక్కువగా ప్రభావితం చేసేవి కావడం, అక్కడ టీఆర్ ఎస్ సెంటిమెంటుకన్నా కూడా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చేవి కావడంతో పవన్‌తో ఇక్కడ వ్యూహం పన్నించేందుకు టీఆర్ ఎస్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యూహానికి పవన్ కూడా అంగీకరించారని అంటున్నారు. మరి బీజేపీ ఏమంటుందో చూడాలి.
– vuyyuru subhash