ఔను! ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఏపీ రాజకీయ పండితుల నోటి నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం జాతీయ మీడియాపై కన్నేసింది. దాదాపు 8 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఓ వర్గం మీడియాకు కట్టబెట్టి.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజాసామాజిక కార్యక్రమాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకునేందుకు జగన్ సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీనిపై పైకి ఒక ప్రచారం జరుగుతున్నా.. అంతర్గతంగా టీడీపీ నేతల అంతర్మథనం మరోలా ఉంది. అందుకే దీనిపై ప్రత్యేకంగా ఓ ప్రచారాన్ని వెలుగులోకి తెచ్చారు.
జగన్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇక్కడ ఓటు బ్యాంకు కోసం.. ఢిల్లీ వర్గాల్లో ప్రచారం ఎందుకు? అని ఓవర్గం మీడియాలో ప్రచారాన్ని జోరు పెంచేలా చేశారు. కానీ, వాస్తవంగా.. జగన్ వ్యూహం వేరే ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చంద్రబాబు పాలన సమయంలో అంటే.. ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజిత నవ్యాంధ్రప్రదేశ్ వరకు కూడా ఆయన కూడా జాతీయ మీడియాను పెంచి పోషించారు.
హిందూ వంటి జాతీయ మీడియాను బాబు ప్రోత్సహించి.. తన తరఫున వకాల్తా పుచ్చుకునేలా చేశారు. తద్వారా.. జాతీయ స్థాయిలో బాబు ఎదిగారు. తరచుగా చంద్రబాబు చెప్పే డైలాగు గుర్తుండే ఉంటుంది.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతా! అనేవారు ఆయన. దీనివెనుక జాతీయ మీడియా ఆయనను ఎత్తేసిన విషయాన్ని మాత్రం దాచిపెట్టేవారు. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు జగన్. జాతీయ స్థాయిలో చంద్రబాబు తెచ్చుకున్న పేరుకు మించి తాను పేరు మోయాలనేది జగన్ వ్యూహంగా ఉందనేది వైసీపీ నేతల మాట.
ప్రస్తుతం ఈ పంథాలోనే వైసీపీ సర్కారు టైమ్స్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకుందని అంటున్నారు. గతంలో చంద్రబాబు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని పేజీలకు పేజీలు ప్రకటనలు గుప్పించారు. ఏపీలో హిందూ సంస్థకు భూములు ఇచ్చారు. ఇప్పుడు జగన్ ఇదే పనిని అధికారికంగా చేస్తున్నారు. తేడా ఇదే! మరి బాబును మించి ప్రచారం పొందుతారా? జాతీయ స్థాయిలో జగన్ కూడా చక్రం తిప్పుతారా? వేచి చూడాలి.