మమత మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే చాన్సుందా..?

-

బెంగాల్లో బీజేపీ, తృణమూల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల ముందే రాళ్లదాడులు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణం వేడెక్కింది. ఈసారి ఎలాగైనా మమతను గద్దె దించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా పోరాటమే ఊపిరిగా బతికే మమతా బెనర్జీ.. అధికారాన్ని నిలబెట్టుకుంటారా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అసలు బెంగాల్ లో మమతా బెనర్జీ బలమేంటి..? ఆమె పాలనపై బెంగాలీలు ఏమనుకుంటున్నారు.. బీజేపీ వ్యూహాలకు మమత ప్రతివ్యూహాలేంటి..?

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మమతా బెనర్జీ ఎప్పుడూ పోరాటమే చేశారు. మా, మాటీ, మనుష్ నినాదంతో ముప్ఫయ్యేళ్ల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన మమతా బెనర్జీ.. బెంగాల్లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగూరులో రైతులతో కలిసి ఉద్యమించిన దీదీ.. సీఎంగానూ సీఏఏకు వ్యతిరేకంగా రోడ్డెక్కి తన ప్రత్యేకతను చాటుకున్నారు. బెంగాల్ ఉట్టి కొట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి.. తనదైన శైలిలో చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు మమతా బెనర్జీ. తనను తాను బెంగాల్ మట్టి మనిషిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ.. బీజేపీని అవుట్ సైడర్ గా చూపిస్తున్నారు. బీజేపీ జై శ్రీరాం నినాదానికి.. జై కాళీ నినాదంతో బదులిస్తున్నారు.

సాదాసీదా కాటన్ చీర, చేతిలో గుడ్డ సంచీ, కాళ్లకు హవాయ్ చెప్పులు. ఇదే మమతా బెనర్జీ వేషధారణ. ముఖ్యమంత్రి అయినా సాదాసీదాగా ఉండే మమత.. సామాన్యులతో ఇట్టే కలిసిపోతారు. గతంలో యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు సీఎం అయ్యాక కూడా మమత వ్యవహారశైలి ఏమీ మారలేదని బెంగాలీలు చెబుతారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా.. మమత అండగా ఉంటారన్న భరోసాను రాష్ట్ర ప్రజలకు కల్పించడంలో మమత నూటికి నూరుపాళ్లు విజయం సాధించారు. బెంగాల్లో 30 ఏళ్లుగా పాతుకుపోయిన కమ్యూనిస్టుల్ని మట్టి కరిపించడానికి మమత వీధిపోరాటాలు చేశారు. రైతులతో కలిసి మమత చేసిన సింగూరు ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఉద్యమమే తృణమూల్ ను అధికారంలోకి తీసుకొచ్చింది.

అయితే వామపక్ష ప్రభుత్వంపై ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేసిన మమత.. సీఎంగా అనుకున్న రీతిలో పనితీరు చూపించలేదనే విమర్శలు లేకపోలేదు. తృణమూల్ నేతలు, కార్యకర్తలు లెఫ్ట్ క్యాడర్ ను వెంటాడి, వేటాడి మరీ చంపుతున్నా అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం చెడ్డపేరు తెచ్చింది. పైగా లెఫ్ట్ ను పగబట్టినట్టుగా నిర్వీర్యం చేసిన మమత… తనంతట తానుగా బీజేపీకి ఎదిగే అవకాశం ఇచ్చారని కూడా విశ్లేషకులు చెబుతారు. బెంగాలీ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. బెంగాల్లో ఈసారి ఎవరు పాగా వేస్తారన్నది దేశవ్యాప్తంగా రాజకీయ, రాజకీయేతర వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మూడు దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగిన వామపక్ష పాలనకు చరమగీతం పాడుతూ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ 2011లో తొలిసారి అధికారపగ్గాలు చేపట్టారు. అయిదేళ్ల పాటు సాగిన ఆమె పాలనకు మంచి మార్కులు వేసిన బెంగాలీలు 2016లోనూ మరోసారి దీదీకే పీఠం కట్టబెట్టారు. కానీ ఈసారి మాత్రం మమత అధికారంలోకి రావడం అంత వీజీ కాదంటున్నారు విశ్లేషకులు.

మమతా బెనర్జీపై కూడా రాజకీయ వారసత్వానికి సంబంధించి ఆరోపణలున్నాయి. దీదీకి పిల్లలు లేకపోయినా.. మేనల్లుడైన అభిషేక్‌ బెనర్జీని రంగంలోకి దించారు. ఆయనను లోక్‌సభకు పంపడమే కాక… పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా చేసి, ఒక రకంగా పార్టీ పగ్గాలను క్రమంగా ఆయన చేతికి అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అభిషేక్‌ ఇప్పటికే పార్టీలో మమతకు అప్రకటిత వారసుడిగా కొనసాగుతున్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుని అమలు చేస్తున్నారు. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లు- ఈ అల్లుడి పెత్తనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ముకుల్‌ రాయ్‌, మిహిర్‌ గోస్వామి లాంటి నేతలు టీఎంసీకి టాటా చెప్పి భాజపా గూటికి చేరారు.

జంగల్‌మహల్‌ ప్రాంతంలో గట్టి పట్టున్న అధికారి కుటుంబం సైతం టీఎంసీకి దూరం అవుతోంది. పార్లమెంటు సభ్యుడు శిశిర్‌ అధికారి, ఆయన కుమారులు సువేందు, దివ్యేందు, సోమేందు… వీళ్లందరికీ ఆ ప్రాంతంలో భారీగా అనుచరవర్గం ఉంది. సువేందు అధికారి నిన్న మొన్నటివరకు మమతా బెనర్జీ క్యాబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా పనిచేసేవారు. దివ్యేందు ఎంపీ; సోమేందు అధికారి ఎమ్మెల్యే. దాదాపు ఆరు జిల్లాల పరిధిలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈ కుటుంబం గట్టి ప్రభావం చూపిస్తుంది. హూగ్లీ రివర్‌ బ్రిడ్జ్‌ కమిషనర్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తనను తప్పించి, టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీని ఆ స్థానంలో కూర్చోబెట్టడంతో సువేందు బాబు ఆగ్రహానికి గురయ్యారు. మంత్రిపదవికి రాజీనామా చేస్తున్నట్లు నేరుగా గవర్నర్‌కు లేఖ పంపారు.

2007లో నందిగ్రామ్‌ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది అధికారి కుటుంబమే. ఒకరకంగా ఆ ఉద్యమం వల్లే 2011లో వామపక్ష ప్రభుత్వం కుప్పకూలింది. సీపీఎమ్‌కు పెట్టనికోటగా ఉన్న జంగల్‌మహల్‌ ప్రాంతాన్ని టీఎంసీవైపు తిప్పినదీ వారే. అలాంటి కుటుంబాన్ని కరివేపాకులా తీసి పక్కన పారేయడం వారికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. గతంలో సీపీఎమ్‌కు అండగా ఉన్న ముస్లిములు, మతువా వర్గం 2011 నుంచి టీఎంసీ వైపు మళ్ళారు. మతువా వర్గానికి పెద్దదిక్కుగా ఉన్న బీణాపాణీ దేవి అలియాస్‌ బోరో మాను మమతా బెనర్జీ తరచూ కలిసేవారు. ఇటీవలి కాలంలో పలు ఎన్నికల్లో సోషల్‌ ఇంజినీరింగ్‌ మంత్రాన్ని పఠిస్తున్న బీజేపీ… బోరో మాను తమవైపు తిప్పుకొంది.

అయితే బీజేపీకి దీటుగా మమత కూడా వ్యూహాలు రచిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు ఉన్న గూర్ఖాలాండ్ నేత బిమల్ గురుంగ్ ను తన వైపుకి తిప్పుకున్నారు. కేసులతో మూడేళ్లుగా కనుమరుగైన గురుంగ్.. హఠాత్తుగా ప్రత్యక్షమై తృణమూల్ గెలుపుకు పనిచేస్తానని చెప్పడం హాట్ టాపిక్ అయింది. అటు తృణమూల్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆయన్ను తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. అయితే పీకే టీమ్ వ్యవహారశైలి కారణంగానే పార్టీకి సీనియర్లు దూరమమౌతున్నారని తృణమూల్ నేతలు చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ కి అధినాయకత్వం అండదండలు ఉండటంతో… ఈ అసంతృప్తి పెద్ద లెక్కలోకి రాదనే వాదన ఉంది.

చివరి క్షణం వరకు ఓటమిని అంగీకరించకుండా పోరాడే తత్వం ఉన్న మమతా బెనర్జీ.. ఎన్నికల నాటికి కచ్చితంగా గెలుపు వ్యూహాలు రచిస్తారని తృణమూల్ కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. మరి బెంగాల్ ఓటరు మొగ్గు ఎటువైపు అనేది ఎన్నికల్లో తేలనుంది.

Read more RELATED
Recommended to you

Latest news