సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి పై జిల్లా మంత్రి క్లారిటీ ఇచ్చేశారా

-

నాగార్జునసాగ‌ర్ ఉపఎన్నిక‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి.కానీ టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మదిలో ఏముంది..అభ్యర్థి కోసం ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన జిల్లా మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవ‌రిని ప్రతిపాదిస్తున్నారు..జిల్లా మంత్రి ఒకే చెప్పిన అభ్యర్ధి అందరికి ఆమోదయోగ్యమేనా ఇప్పుడు దీనిపైనే టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక జరగనుంది. ఆయన అనారోగ్యంతో చ‌నిపోయి నెలన్నర కావ‌డంతో ఏ క్షణమైనా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుద‌లయ్యే ఛాన్స్ ఉంది. సీనియ‌ర్ నేత‌ జానారెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ ఖ‌రారు చేయ‌డంతో టీఆర్ఎస్ కూడా క్యాండిడేట్‌ ఎంపికపై దృష్టి పెట్టింది. దుబ్బాక‌లో ఓట‌మి, జీహెచ్ఎంసీలో అనుకున్న ఫ‌లితం రాక‌పోవ‌డంతో ఆచితూచి అడుగువేస్తోంది టీఆర్ఎస్. షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థి పై క్లారిటీ ఇచ్చేందుకు కసరత్తు మొద‌లుపెట్టింది.

నోముల న‌ర్సింహ‌య్య త‌న‌యుడు నోముల భ‌గ‌త్ త‌న‌కే సీటు ఇస్తుంద‌ని భావిస్తున్నారు. హైకోర్టులో లాయ‌ర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న భ‌గ‌త్.. తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటించేవారు. నేత‌ల‌తో స‌త్సంబంధాలు, త‌న తండ్రికి ఉన్న మంచి పేరు తనకు ప్లస్ అవుతుందని లెక్కలేస్తున్నారు. నోముల న‌ర్సింహ‌య్య బంధువు ఉస్మానియా యూనివ‌ర్సిటీ జేఏసీ నేత బాల‌రాజు యాద‌వ్ ఇప్పటికే టీఆర్‌ఎస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత‌ను క‌లిసి అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు.

ఇక ఉపఎన్నికపై జిల్లా మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి త‌న మ‌న‌సులోని మాట అధిష్ఠానం పెద్దలకు చెప్పేశారు. స్థానికంగా ఉంటున్న అడ్వకేట్‌ ఎంసీ కోటిరెడ్డి పేరును ప‌రిశీలించాల‌ని సూచించారు. నోముల కుటుంబం కంటే మెరుగైన అభ్యర్థిగా కోటిరెడ్డికి పేరుంద‌నేది మంత్రి అభిప్రాయం. ఒకప్పుడు జానారెడ్డికి అనుచరుడిగా ఉన్న కోటిరెడ్డి. మంత్రి జ‌గ‌దీష్‌కి క్లాస్‌మేట్ కూడా. జిల్లా ప్రజాప్రతినిధులు కోటిరెడ్డికి మ‌ద్దతు తెలిపేలా జ‌గ‌దీష్‌రెడ్డి మంత్రాంగం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఉపఎన్నికలో జానారెడ్డిని ధీటుగా ఎదుర్కొనేందుకు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును కూడా టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ పరిశీలిస్తోందట. మంత్రి పదవి ఆశించి మండలి చైర్మన్‌ అయిన గుత్తా పార్టీ అధిష్ఠానం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు సమాచారం. ఒకవేళ గుత్తాను వద్దని అనుకుంటే.. మరోనేత తేరా చిన్నపరెడ్డి అభ్యర్థిత్వంపై కూడా పార్టీ చర్చిస్తోందట. కానీ మంత్రి మాటే ఫైనల్ అవుతుందా అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news