అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐతే ఈ కార్యక్రమంలో ఆమె వస్త్రధారణ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సందర్భంగా కమల తన భారతీయ మూలాలను పలుమార్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ తన పుట్టుక గురించి ఎన్నో సందర్భాల్లో ఆమె చెప్పుకున్నారు. భారతీయ మూలాలున్న కమల చీర కట్టులో ప్రమాణస్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయ్. ఇప్పుడు కమల వస్త్రధారణపైనే అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
2019లో ఓ ఎన్నికల సమావేశం సందర్భంగా విజయం సాధిస్తే చీర కట్టుకుంటారా అని కమలను ప్రశ్నించినప్పుడు..ముందు గెలుద్దాం అని ఆమె సమాధానమిచ్చారట. కమల తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైలో పుట్టి పెరిగి..అమెరికాకు వలస వెళ్లారు. భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ..చీరను ధరించటం ద్వారా ఆమెకు మరింత నైతిక బలం చేకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అధికార స్వీకరణ సమయంలో మేడం వైస్ ప్రెసిడెంట్ చక్కటి బెనారస్ పట్టుచీరలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదని..న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బిబు మొహాపాత్ర ఓ ఇంటర్వూలో చెప్పారు. దీంతో కమల చీరలో కనిపించవచ్చనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.56 ఏళ్లుగా ఫార్మల్ సూట్లనే ధరించిన కమల హారిస్ ఏం ధరిస్తారనేది అంత ముఖ్య విషయం కాదంటున్నారు మరికొంతమంది.
కమల సమీప బంధువు మీనా హారిస్ ఇటీవల ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఫ్యూచర్ ఈజ్ ఫిమేల్ అని రాసి ఉన్న సాక్సులను హారిస్ ధరించి కనిపించారు. దీంతో సంబంధిత కంపెనీ సాక్సులకు డిమాండ్ విపరీతంగా పెరిగి..స్టాకు సైతం అందుబాటులో లేకుండా పోయిందట. అమెరికా ఉపాధ్యక్షురాలిగా అత్యున్నత స్థానానికి చేరుకున్న తొలి మహిళగానే కాకుండా నల్లజాతీయురాలిగా, దక్షిణాసియా మూలాలున్న వ్యక్తిగా కూడా కమలా హారిస్ నిలిచిపోనున్నారు.
ఈచారిత్రాత్మక సమయంలో ఆమెకు సంబంధించిన చిన్న అంశమైనా పెద్ద ప్రభావాన్నే కలుగచేస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.