నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ప్రచారం రసవత్తరంగా సాగుతున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు చర్చకు దారితీస్తోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ హై కమాండ్ ఎన్నికల ఇంచార్జ్ లను నియమించి వారికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల ఇంఛార్జ్‌ను పిలవకుండానే ఎలక్షన్ సన్నాహక సమావేశం నిర్వహించి చర్చకు కారణమయ్యారు ఓరుగల్లు అధికారపార్టీ ఎమ్మెల్యే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముడిపడిన విషయం కావడంతో.. గులాబీ శిబిరంలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
చల్లా ధర్మారెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే. ఇటీవల కాలంలో అయోధ్య విరాళాలు.. దళిత వర్గాలపై చేసిన కామెంట్స్‌తో చర్చల్లోకి వచ్చారు. రచ్చ రచ్చ అయింది. ఆయన ఇరుకున పడ్డారు.. పార్టీని ఇరకాటంలో పెట్టారు. ఆ పరిణామాలను టీఆర్ఎస్ నేతలు మర్చిపోకముందే మరో అంశంతో ప్రచారంలోకి వచ్చారు ధర్మారెడ్డి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోనే పరకాల ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు నియోజకవర్గాల వారీగా ఎన్నికల ఇంఛార్జులను పెట్టింది టీఆర్ఎస్. పరకాలకు చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా.. ఆయనపై వచ్చిన వివాదాల వల్లో ఏమో.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఎన్నికల ఇంఛార్జ్‌గా నియమించింది పార్టీ. ఈ నిర్ణయం ధర్మారెడ్డికి రుచించ లేదని సమాచారం.
ఇటీవల పరకాలలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సభకు శ్రీనివాసరెడ్డిని పిలవలేదట ధర్మారెడ్డి. పార్టీ నేత గ్రండ జ్యోతి తదితరులను ఆహ్వానించారట. పరకాల ఆర్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన సమావేశానికి మంత్రి దయాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు. అయితే ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి కనిపించకపోవడంతో కొందరు పార్టీ నేతలు నేరుగా ఆయనే ఫోన్ చేసి ఎందుకు రాలేదు అని ఆరా తీశారట. మీటింగ్ విషయం తెలియని ఆయన.. వేరే వర్కులో ఉండి రాలేకపోయాను.. త్వరలో వస్తాను.. మీరు మాత్రం పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని బదులిచ్చారట. ఈ సమాధానంతో సంతృప్తి చెందని పార్టీ నేతలు ఏదో జరిగిందని భావించి కూపీ లాగడం మొదలుపెట్టారట. ఈ సందర్భంగా పరకాలలో ఆధిపత్య పోరు బయటపడినట్టు సమాచారం.
ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డిది కూడా పరకాల నియోజకవర్గమే. ప్రస్తుత ప్రతికూల వాతావరణంలో పార్టీ చెప్పింది కదా అని శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యమిస్తే.. భవిష్యత్‌లో తన సీటుకే ఎసరు రావొచ్చని ధర్మారెడ్డి అనుమానిస్తున్నారట. దీనికితోడు ధర్మారెడ్డిని పక్కనపెడితే శ్రీనివాసరెడ్డే పరకాలలో ప్రత్యామ్నాయమని కొందరు అప్పుడే ప్రచారం మొదలుపెట్టేశారట. పైగా ఆయన అధిష్ఠానానికి సన్నిహితుడనే పేరు ఉంది. ధర్మారెడ్డికి ఆ భయం కూడా ఒక కారణం కావొచ్చని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి శ్రీనివాసరెడ్డిని పిలవకపోవడం కూడా అందులో భాగమేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. అందుకే ఎమ్మెల్యే ఇలా చేశారా అన్న చర్చ నడుస్తుంది.