నారాయణ మనసు మారుతోందా.. రాజకీయంగా మైలేజ్ కోసమా ?

-

తెలుగు రాష్ట్రాలకు సీపీఐ నారాయణగా గుర్తింపు పొందిన ఈ సీనియర్‌ పొలిటీషియన్‌ ఇటీవల కాలంలో చర్చల్లోకి వస్తున్నారు. తన చర్యలు.. తీరుతో అటు లెఫ్ట్‌ పార్టీలలోనూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు ఈ కామ్రేడ్‌. ఇప్పుడు విశాఖలో శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆశ్రమానికి వెళ్లి.. స్వామీజీకి ప్రణమిల్లి.. నలుగురితో నారాయణ అని అనిపించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నారాయణ శకం మొదలైన తర్వాత సీపీఐ అంటే నారాయణ.. నారాయణ అంటే సీపీఐ అన్నట్టుగా మారిపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ కార్యదర్శి. కాకపోతే.. మొదటి నుంచి సీరియస్‌ పార్టీలో నాన్‌ సీరియస్‌ పొలిటీషియన్‌ అనే విమర్శలకు తన చర్యల ద్వారా నారాయణే ఆస్కారం ఇచ్చారు.


కమ్యూనిస్ట్‌లు అంటే తీవ్రమైన సిద్ధాంతల ప్రాతిపదికన పనిచేస్తారని గుర్తింపు ఉంది. గెలుపోటములు ఎలా ఉన్నా.. లెఫ్ట్‌ పార్టీల నేతల జీవన విధానం.. ఆచరణ.. సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుంది. ప్రధానంగా కామ్రేడ్లు హేతువాదులుగా ఉండటం అనాదిగా వస్తోంది. వామపక్షాల నాయకులు అడుగులు కూడా అటే పడుతుంటాయి. నారాయణ కూడా తన వ్యక్తిగత నమ్మకాలు ఎలా ఉన్నా హేతువాదే. అలాంటి నాయకుడు సడెన్‌గా.. అప్పుడప్పుడూ పబ్లిక్‌లో భిన్నంగా కనిపిస్తున్నారు

గతంలో గాంధీ జయంతి రోజున చికెన్‌ తిని.. చికెన్‌ నారాయణ అనిపించుకున్నారు. ఆ సమయంలో విమర్శలు వెల్లువెత్తడంతో.. ఏడాదిపాటు చికెన్‌ తినబోనని ఆయనకు ఆయనే ప్రకటించారు. కొన్నిరోజుల క్రితం తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో తిరుమల వెళ్లడం ఒక ఎత్తు అయితే.. నారాయణుడి చెంతకు సీపీఐ నారాయణ వెళ్లడం కూడా అప్పట్లో ఓ సంచలనం. ఆ సందర్భంగానూ ఈ లెఫ్ట్‌ నేత తన తిరుమల పర్యటనపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల వేడి నెలకొంది. విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తూ.. నేరుగా శారదాపీఠం స్వరూపానందేంద్ర ఆశ్రమంలోకి వెళ్లారు. స్వామీజీ ఆశీసులు తీసుకున్నారు. ఈ సంఘటనను హేతువాదులు, లెఫ్ట్‌ పార్టీల నాయకులు ఆశ్చర్యంగా చూశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వామీజీ ఆశ్రమానికి వెళ్లినట్టు నారాయణ చెప్పినా అది అంత కన్వెన్సింగ్‌ లేదన్నది లెఫ్ట్‌ పార్టీ వర్గాలు చెప్పేమాట. పనిగట్టుకుని ఆశ్రమానికి వెళ్లి.. స్వామీజీ ఆశీసులు తీసుకోవడాన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగా చూడలేమన్నది ఇంకొందరి అభిప్రాయం. నారాయణ మనసు మారుతోందా? లేక పొలిటికల్‌ గిమ్మిక్కా అన్నది కాలమే చెప్పాలి.

విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీపీఐ ఎన్ని డివిజన్లలో గెలుస్తుందన్నది పక్కన పెడితే.. ప్రస్తుతం అక్కడ ఉక్కు ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ జిమ్మిక్కుల వల్ల కలిగే ప్రయోజనం కంటే విశాఖ ఉక్కు ఉద్యమంపై నారాయణ ఫోకస్‌ పెడితే.. సీపీఐకి ప్రజల్లో ఆదరణ పెరిగే అవకాశం ఉంటుందనేది లెఫ్ట్ పార్టీ నేతల అభిప్రాయం. మరి.. కామ్రేడ్‌ నారాయణ ఏ చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news