అమరావతి: ఏపీ సీఎం జగన్ గురు, శక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిశారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అయితే సీఎం జగన్కు అమిత్ షా ఓ ప్రపోజల్ పెట్టారట. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో నలుగురు, గవర్నర్ కోటాలో 4 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. వీటిలో కొన్ని ఎమ్మెల్సీలను తమ పార్టీకి ఇవ్వాలని ప్రపోజల్ చెప్పారట.
ప్రస్తుతం ఏపీలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో అసెంబ్లీలో బీజేపీ వాయిస్ వినిపించడం కుదరడంలేదు. అటు శాసనమండలిలోనైనా వాయిస్ వినిపించాలని కేంద్ర, రాష్ట్ర నేతలు భావిస్తున్నారట. ఈ మేరకు ఎమ్మెల్సీలను తమకు కేటాయించాలని సీఎం జగన్కు ప్రపోజల్ పెట్టారట. మరి అమిత్ షా అభ్యర్థనతో బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయేమో చూడాలి.
మరోవైపు గవర్నర్ కోటాలో నలుగురు వైసీపీ అభ్యర్థులను జగన్ ఖరారు చేశారని తెలుస్తోంది. నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్కు సిఫారసు చేశారు. గవర్నర్ ఆమోదితే వెంటనే భర్తీ చేస్తారట. కడప నుంచి ఆర్వీ రమేశ్ యాదవ్, తూర్పుగోదావరి నుంచి తోట త్రిమూర్తులు, గుంటూరు లేళ్ల అప్పిరెడ్డి, పశ్చిమగోదావరి నుంచి మోషేను రాజు ప్రతిపాదిస్తూ గవర్నర్ పంపారని సమాచారం.