అశ్వగంధకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు వాడుతారు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, పురుషుల్లో వీర్య వృద్ధి, అంగ స్తంభన, రోగ నిరోధక శక్తి.. వంటి అంశాలకు అశ్వగంధను ఎక్కువగా వాడుతారు. అయితే కోవిడ్ వచ్చి రికవరీ అవుతున్న వారికి ఈ అశ్వగంధను ఇస్తే వారిలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకనే అశ్వగంధపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, యూకేలోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో కోవిడ్ వచ్చి రికవరీ అవుతున్న పేషెంట్లపై అశ్వగంధతో త్వరలో క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు. మొత్తం 2000 మందిని ఈ ట్రయల్స్ కోసం ఎంపిక చేస్తారు. వారిలో 1000 మందికి అశ్వగంధను రోజూ ఉదయం, సాయంత్రం 500 ఎంజీ మోతాదులో ఇస్తారు. మరో 1000 మందికి ప్లేసిబో (ఫేక్ మాత్ర) ఇస్తారు. తరువాత అశ్వగంధను తీసుకున్న వారిలో ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా ? అనే వివరాలను పరీక్షిస్తారు. దీంతో కోవిడ్ వచ్చి రికవరీ అవుతున్న వారిలో అశ్వగంధ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది.
త్వరలో ఈ క్లినికల్ ట్రయల్స్ చేపట్టనుండగా.. దీని ద్వారా పలు ముఖ్యమైన విషయాలు తెలుస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అశ్వగంధ ఇప్పటికే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ఆయుర్వేద మూలిక. కోవిడ్ నుంచి రికవరీ అవుతున్న వారికి దీన్ని ఇస్తే ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని సైంటిస్టులు నమ్ముతున్నారు. కనుక కోవిడ్ వచ్చిన వారు దీన్ని తీసుకుంటే కొంత మేర ఉపయోగం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.