తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మరోసారి బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు వేడెక్కించాయి. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో అది అయిపోయేన వెంటనే వీలైనంత వరకు పెద్ద ఎత్తున సమావేశాలు, పాదయాత్రలు సభలు ఏర్పాటు చేసి తెలంగాణలో మరింత బలం పెంచుకోవాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. హుజూరాబాద్లో గెలుస్తామనే ధీమా ఉంది కాబట్టి తమ బలం బీజేపీ పెరిగిందని ప్రచారం చేసుకోవచ్చని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కూడా మొదలు పెట్టేశారు.
మరో వైపు 17న తెలంగాణ విమోచన సభను కూడా నిర్వహించబోతున్నారు. దీంతో బీజేపీ దూకుడుపై ఇటు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధులపై రెండు వర్గాల మధ్య మరోసారి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. వీలు చిక్కినప్పుడల్లా కేంద్రం నుండి వచ్చే నిధులపై ప్రశ్నిస్తున్న మంత్రి కేటీఆర్ ఇదే విషయంపై మరోసారి మాటలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం నుండి తీసుకుపోతున్నప్రతి రూపాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం యాబై శాతం నిధులు మాత్రమే వస్తున్నాయని, కేంద్రం తెలంగాణ రాష్ట్రం పై వివక్ష చూపుతోందని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇంకో అడుగు ముందుకు వేసి కేటీఆర్ తాను చెప్పిన లెక్కల్లో ఏదైనా తేడా అనిపిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని, దీనిపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఇక ఈ సవాల్‌ను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్వీకరించాలని, ఒకవేళ అది నిజమే అయితే ఆయన రాజీనామా చేయాలంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడే మాటలు తుపాకి రాముడి మాటల లాంటివని, తనతో పాటు సీఎం కేసీఆర్ కూడా రాజీనామా చేస్తే అప్పుడు పీఎం మోడీ దగ్గరకు వెళ్లి నిజాలు తెలుసుకుందామని చెప్పారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలతో బీజేపీ వర్సెస్ టీఆర్ ఎస్ వైరం మరోసారి ముదిరింది.