కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా హుజూరాబాద్ గెలుపును అభివర్ణించారు ఈటెల రాజేందర్. నన్ను ఓడించేందు డబ్బు సంచులు, మద్యం సీసాలతోనే కాకుండా.. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారన్నారు ఈటెల. నా పక్కన ఒక్క వ్యక్తి కూడా ఉండకుండా టీఆర్ఎస్ ప్రయత్నించిందని విమర్శించారు. ఆరునెలలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన టీఆర్ఎస్.. నన్ను ఓడించలేకపోయిందన్నారు. ప్రజలు గొప్పగా అండగా నిలిచారన్నారు. హుజూరాబాద్లో ప్రజలు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియ జేశారు. దళిత బంధు పథకంతో దళిత జాతిని తన వైపు తిప్పుకోవాలనుకున్న టీఆర్ఎస్ పాచిక పారలేదని, దళిత జాతి పదిసార్లు పదిలక్షలు ఇచ్చినా.. తన వైపే ఉంటామని హామీ ఇచ్చారన్నారు. కులసంఘాలకు కోట్లుకోట్లు కుమ్మరించినా ప్రజలు నమ్మలేదని విమర్శించారు.
నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీనే అని ఆయన అన్నారు. అమిత్ షా నాకు అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారని వెల్లడించారు. నా విజయం కోసం బీజేపీ కార్యకర్తలతో పాటు మురళీధర్ రావు, లక్ష్మణ్, సంజయ్, అరవింద్ వంటి వారు సహకరించారన్నారు. బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు వంటి వారు మద్దతుగా నిలిచారని వెల్లడించారు. గెలుపుకు సహకరించిన బీజేపీ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు.