రాజకీయాలు ఎప్పుడు నిర్మాణాత్మకంగా నడవాలి. నాయకులు ఎప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. నాయకులు రాజకీయంగా విమర్శించుకోవచ్చు…కానీ వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. కానీ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అలా లేవు. పూర్తిగా హద్దులు దాటేసి వ్యక్తిగతంగా బూతులు తిట్టుకునేవరకు నేతలు వెళ్ళిపోయారు. ఇక తెలంగాణ కంటే ఏపీ రాజకీయాలు మరీ దరిద్రంగా తయారయ్యాయి. మొన్నటివరకు బూతుల రాజకీయమే జరిగింది…కానీ ఇప్పుడు అసభ్య రాజకీయ పర్వం మొదలైంది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నేతలు… చంద్రబాబుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిడుతున్న విషయం తెలిసిందే. ఇటు టీడీపీ నేతలు కూడా అదే పనిగా సీఎం జగన్‌ని ఉద్దేశించి బూతులు మాట్లాడుతూ వచ్చారు. ఇలా వైసీపీ-టీడీపీ నేతల మధ్య బూతుల రాజకీయం నడుస్తూ ఉంది. కానీ తాజాగా బూతుల రాజకీయం కాస్త అసభ్యంగా మారింది. తాజాగా కుప్పంలో టీడీపీ ఓటమిపై వైసీపీ నేతలు చంద్రబాబుని ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. జగన్ సైతం కుప్పం ఓటమి తర్వాత చంద్రబాబు మొహం చూడాలని ఉందని మాట్లాడారు.
ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు… ఇక మామూలుగానే వైసీపీ నేతలు చంద్రబాబుని ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. దీంతో చంద్రబాబు కూడా కౌంటర్ ఎటాక్‌కు దిగారు. బాబాయి గొడ్డలి పోటు, తల్లికి ద్రోహం చేయడంపై కూడా చర్చ చేద్దామని మాట్లాడారు.
అయితే కొడాలి నాని, అంబటి రాంబాబు లాంటి నేతలు… ఏకంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి టాపిక్‌ని పరోక్షంగా తీసుకొచ్చారు. పరోక్షంగా ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టి ఆ నాయకులు మాట్లాడటంతో అసలు రచ్చ మొదలైంది…ఈ క్రమంలో బాబు ఆవేదనతో లేచి..తనని ఎన్నోసార్లు అవమానించిన భరించానని, కానీ చివరికి తన భార్య గురించి కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారని, ఇక సభలో సీఎం అయ్యేవరకు అడుగుపెట్టానని చెప్పి బయటకు వెళ్ళిపోయారు.
ఇక మీడియా ముందు కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ… ఎప్పుడూలేని విధంగా చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబుది డ్రామా అని జగన్ కౌంటర్ ఇచ్చారు. వారే తన బాబాయ్, తల్లి గురించి మాట్లాడారని, దీంతో తమ నేతలు కూడా స్పందించే పరిస్తితి వచ్చిందని, దానికి డ్రామా చేస్తూ వెళ్లిపోయారని అన్నారు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది..ఒప్పు ఎవరిది అనేది జనమే తేల్చాలి. కానీ రాజకీయాలు ఇలా అసభ్యంగా మాత్రం జరగకూడదు.