ప్రధాని నరేంద్ర మోదీపై పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ నోటీసులు అందించారు టీఆర్ఎస్ ఎంపీలు. ఈమేరకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులను రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు నోటీసులు అందించారు. ఎంపీలు కేశవరావు, సంతోష్, బడుగుల లింగయ్యయాదవ్ నోటీసులు అందించిన వారిలో ఉన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారని ప్రివిలేజ్ మోషన్ నోటీసుల్లో ఫిర్యాదు చేశారు. తలుపులు మూసేసి బిల్లును పాస్ చేశారనడం రాజ్యాంగాన్ని అవమానించడమే అని టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘనల కిందికే వస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టే ముందు కావాల్సిన విధానాలన్నింటిని పార్టీలు పాటిస్తామని టీఆర్ఎస్ ఎంపీలు అంటున్నారు.
మొన్న రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ఏపీ విభజన తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్సే కారణం అంటూ.. ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చర్చ జరగకుండానే బిల్లు పాస్ చేశారని ప్రధాని అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది.