రాజకీయం ఎలా ఉన్నా సరే ఈ సారి మాత్రం పవన్ తనదైన వేగంతో పోగల సమర్థను పోగేసుకోవాలి.గతంలో మాదిరిగా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇచ్చి క్రియాశీలకంగా ఉండకుండా స్తబ్దుగా ఉండకుండా,ఈ సారి మాత్రం గెలుపు గుర్రం పవన్ అయి తీరాలి. ఇప్పటికే అహంకారంపై యుద్ధం చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి జనసేన చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగా రాజకీయం మారాలంటే ముందు మారాల్సింది పవనే ! ఆయన తనదైన రాజకీయం అలవర్చుకుని, వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు అయినా గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఆ విధంగా జనసేన పార్టీని పవన్ కానీ నాదెండ్ల కానీ బలోపేతం చేసేందుకు ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ అనుకూలం అయి ఉన్నాయో లేదో నిర్థారించుకోవాలి.అటుపై యుద్ధ సన్నాహం ప్రత్యర్థి పార్టీలపై మొదలుపెట్టాలి.
జనసేన త్వరలోనే ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేయనుంది.ప్రజాస్వామిక విలువలపై విశ్వాసం ఉన్నవారెవవరైనా సరే తమ పార్టీ గూటికి వచ్చి చేరాలని,ఆ విధంగా వైసీపీ నాయకులు చేరేందుకు ఇదే సరైన సమయమని, పవన్ తో కలిసి నడిచేందుకు అదేవిధంగా రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడేందుకు ఇదే అనుకూలమయిన సందర్భం అని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ అంటున్నారు.దీంతో జనసేన త్వరలోనే ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేయనుంది అని తేలిపోయింది. పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఎవ్వరినయినా ఆహ్వానించాలని, ఈ విషయమై అటు వైసీపీని ఇటు టీడీపీని కలుపుకుని పోవాలని జనసేనాని భావిస్తున్నా రు.
2014 ఎన్నికల్లో పవన్ సాయంతో గెలిచిన టీడీపీ నాయకులు కానీ 2019లో పవన్ కారణంగాగెలిచిన వైసీపీ అభ్యర్థులు కానీ ఇవాళ జనసేన గూటికి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.వీరంతా పవన్ తోనే నడిచేందుకు ఇష్టపడుతున్నారు కూడా! సంబంధిత పార్టీలలో కనుక గుర్తింపు రాకపోయినా టికెట్ వేళల్లో ఇబ్బందులు ఎదురయినా వెంటనే ఇటుగా వచ్చేందుకు జనసేన పార్టీనే తమకు సరయిన వేదిక అని భావిస్తున్నారు.ఇప్పటికే టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిలను ఖరారు చేస్తూ వారినే వచ్చే ఎన్నికల్లో పోటీచేయించేందుకు సిద్ధం అవుతోంది.ఈ దశలో టీడీపీలో ఉన్న అసంతృప్తులు ఇటుగా వచ్చే ఛాన్స్ కొట్టిపారేయలేం.
ముఖ్యంగా కృష్ణా,ప్రకాశంతో సహా ఉభయ గోదావరి జిల్లాలలో నాయకులు పవన్ కు అభిమానులుగానే ఉన్నారు.వీరంతా వేర్వేరు పార్టీలకు చెందిన వారు అయినప్పటికీ తమ దైన రాజకీయం చేస్తున్నప్పటికీ ఒకవేళ పవన్ పార్టీ ఫాంలోకి వస్తే వీళ్లంతా ఇటుగా రానున్నారు.కనుక జనసేన కాస్త దృష్టి సారించి పార్టీలోకి వచ్చేందుకు నాయకులు విధించే షరతులు విని, వాటికి అంగీకారం అయితే తప్పకుండా పవన్ బలగం మరింత బలపడేందుకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేం.