టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే.. టీడీపీ బాదుడే బాదుడు పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల మొదటి వారంలో ఉత్తరాంధ్ర 3జిల్లాల్లో పర్యటించారు చంద్రబాబు. గత వారం సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. నేడు కడప జిల్లాలోని కమలాపురం, 19న నంద్యాల జిల్లాలోని డోన్, 20న సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యట సాగనుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. ఆయా జిల్లాలల్లో ఉదయం కార్యకర్తలు, ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మహానాడు లోపు ఏపీలోని మూడు ప్రాంతాలను చుట్టేలా అధినేత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
చంద్రబాబు ప్రయాణం ఇలా.. ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని అనంతరం కడప ఇర్కాన్ కూడలి సమీపంలోని డీఎస్‌ఆర్ కల్యాణ మండపంలో ఉమ్మడి కడప జిల్లాలోని పది నియోజకవర్గాల నేతలతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం 3.20కి కడప నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కమలాపురం చేరుకుంటారు. ఇక్కడ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మాజీ మంత్రి చినరాజప్ప మంగళవారం కడపకు చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో కలిసి కమలాపురంలో ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రి 7 గంటలకు కమలాపురం నుంచి రోడ్డుమార్గంలో నంద్యాల జిల్లాలో పర్యటనకు చంద్రబాబు వెళ్లనున్నారు.