వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆమె పార్టీకి అండగా నిలిచారు. పాదయాత్రలతో జనానికి బాగా దగ్గరయ్యారు.
అటు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇప్పటికే ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే గెలుపుపై ధీమాగా ఉంది. అనేక సర్వేలు ఇప్పటికే వైకాపాకు పట్టం కట్టిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. త్వరలో తమ పార్టీ అధినేత జగన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్న అభిమానుల కల నెరవేరబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జగన్ సీఎం అయితే ఆయన సోదరి షర్మిలకు పార్టీలో లేదా ప్రభుత్వంలో ఏదైనా కీలక బాధ్యతలు అప్పగిస్తారా..? అన్న అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే అసలు జగన్ మదిలో ఏముంది ? షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారా..? లేదంటే ప్రభుత్వంలోకి తీసుకుంటారా..? అన్నది ఒక్కసారి పరిశీలిస్తే…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆమె పార్టీకి అండగా నిలిచారు. పాదయాత్రలతో జనానికి బాగా దగ్గరయ్యారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బై బై బాబు నినాదాంతో ఓటర్లను వైకాపా వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అందులో సఫలీకృతం కూడా అయ్యారు. బై బై బాబు అని షర్మిల ఇచ్చిన నినాదం ఆ పార్టీకి ఓట్లను రాబట్టడంలో చాలా వరకు విజయవంతం అయిందనే చెప్పవచ్చు. అయితే పార్టీకి ఇంత చేసినప్పటికీ షర్మిల మాత్రం ఇప్పటికీ పార్టీకి ఓ సాధారణ కార్యకర్తలాగే పనిచేస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల ఫలితాల్లో వైకాపా గెలిచి అధికారంలోకి వస్తే షర్మిలకు కచ్చితంగా పార్టీలో లేదా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇవ్వాలని వైకాపాలోని ఓ వర్గం నాయకులు జగన్‌ను ఇప్పటికే అనేక సార్లు కోరారట.
అయితే జగన్ మాత్రం షర్మిల విషయంపై ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదట. కానీ పార్టీలోనే షర్మిలకు కీలకబాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వంలోకి తీసుకోకపోవచ్చని తెలిసింది. అయితే తెలంగాణలో కేసీఆర్ తన కుమారుడు, కుమార్తె, మేనల్లుడిని ఇప్పటికే రాజకీయాల్లో నిలిపిన నేపథ్యంలో అటు ఏపీలో జగన్ ఒక్క షర్మిలకు ప్రభుత్వంలో ప్రత్యేక స్థానం కల్పించినా ఎవరూ ఆక్షేపించరని, కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని ఎవరూ అనలేరని కూడా వైకాపా నేతలు జగన్ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ క్రమంలో షర్మిలకు ప్రభుత్వంలోనే ఏదైనా ఒక బాధ్యత అప్పగించే అవకాశం కూడా లేకపోలేదని వైకాపా నేతలు అభిప్రాయపడుతున్నారని సమాచారం.
అయితే జగన్ మాత్రం తన సోదరి విషయంలో ఏమనుకుంటున్నారో ఇప్పటికైతే ఇంకా బయటకి వెల్లడించలేదు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం ఆయన ఆ విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఇక ప్రస్తుతం ఆయన సిమ్లా విహార యాత్రలో ఉన్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆ తరువాత ఒక్కో అంశంపై జగన్ దృష్టి సారిస్తారని తెలుస్తోంది. అదే కోవలో షర్మిలకు ఇచ్చే పదవి లేదా బాధ్యతల అంశాన్ని కూడా జగన్ పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. మరి ఆ విషయం తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు..!