ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం జ‌గ‌న్ మ‌ద్ద‌తు బీజేపీకే..? ఏపీకి ప్ర‌త్యేక హోదా కోస‌మే..?

-

వైసీపీ ఈసారి 20కి పైగా ఎంపీ సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని స‌ర్వేలు చెప్ప‌డంతో.. కాంగ్రెస్, బీజేపీలు ఆ పార్టీపై క‌న్నేశాయి. ఈ క్ర‌మంలో వైకాపా అధినేత జ‌గ‌న్‌ను త‌మ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని ఇప్ప‌టికే ఆ పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖులు కోరిన‌ట్లు తెలిసింది.

ఎన్నిక‌ల ఫ‌లితాలు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నేత‌ల్లో రోజు రోజుకీ టెన్ష‌న్ అధిక‌మ‌వుతోంది. మ‌రో వారం రోజుల్లో ఎవ‌రి భ‌విత‌వ్యం ఏమిటో తేల‌నుంది. దీంతో త‌మ పార్టీయే గెలవాల‌ని, అధికారంలోకి రావాల‌ని నేత‌లు త‌మ త‌మ ఇష్ట దైవాల‌ను ప్రార్థిస్తున్నారు. ఈ నెల 19వ తేదీన చివ‌రి ద‌శ పోలింగ్ ముగిశాక.. అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఈ క్ర‌మంలో ఆ పోల్స్‌లో పార్టీల భ‌విత‌వ్యం ఏమిటో మ‌నకు చూచాయ‌గా తెలుస్తుంది. అయితే 23వ తేదీన ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక‌.. త‌మ పార్టీకి పూర్తి మెజారిటీ రాక‌పోతే ఏం చేయాల‌నే విష‌యంపై ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి.

ఎన్నిక‌ల ఫ‌లితాల్లో సంపూర్ణ మెజారిటీ వ‌స్తే ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. అదే ఆశించిన స్థాయిలో సీట్లు రాకున్నా, మెజార్టీ సీట్లు సాధించ‌లేక‌పోయినా.. నేత‌ల్లో టెన్ష‌న్ త‌ప్ప‌దు. ఈ క్రమంలోనే దేశంలోని రెండు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు.. ఎన్నిక‌ల ఫ‌లితాల్లో త‌మ‌కు సంపూర్ణ మెజారిటీ రాక‌పోతే ఏం చేయాలి ? అనే విష‌యంపై తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలిసింది. ఎందుకంటే పూర్తి మెజారిటీ రాని ప‌క్షంలో దేశంలోని ప్ర‌తి చిన్నా చిత‌కా పార్టీని క‌లుపుకుని పోవాలి. ఆ పార్టీల నాయ‌కులు కోరే గొంతెమ్మ కోర్కెల‌ను తీర్చాలి. అవి తేడా కొడితే మొద‌టికే మోసం వ‌స్తుంది. మ‌రో 5 ఏళ్ల పాటు ఇత‌ర పార్టీల‌కు అధికారం ఇచ్చి ప్ర‌తిప‌క్షంలో దోమ‌లు తోలుకుంటూ కూర్చోవాలి. క‌నుక అలాంటి స్థితి రాకుండా ఉండాల‌నే ఇప్పుడు ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు దేశంలోని చిన్న చిన్న పార్టీల నాయ‌కుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉంటున్నార‌ని తెలిసింది.

దేశంలో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచే అనేక సర్వేలు కేంద్రంలో హంగ్ వ‌చ్చే స్థితి ఉంటుంద‌ని తేల్చి చెప్పేశాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీలు త‌మ‌కు పూర్తి మెజారిటీ రాని ప‌క్షంలో చిన్న పార్టీల‌ను క‌లుపుకుని పోవాల‌ని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీల నేత‌లు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నార‌ని స‌మాచారం. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే వైసీపీ ఈసారి 20కి పైగా ఎంపీ సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని స‌ర్వేలు చెప్ప‌డంతో.. కాంగ్రెస్, బీజేపీలు ఆ పార్టీపై క‌న్నేశాయి. ఈ క్ర‌మంలో వైకాపా అధినేత జ‌గ‌న్‌ను త‌మ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని ఇప్ప‌టికే ఆ పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖులు కోరిన‌ట్లు తెలిసింది.

అయితే కేంద్రంలో ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్నా జ‌గ‌న్ ఇప్ప‌టికే ఓ ష‌ర‌తు పెట్టిన విష‌యం విదిత‌మే. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే పార్టీతోనే తాము క‌లుస్తామ‌ని, ఆ పార్టీకే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జ‌గ‌న్ గ‌తంలో స్ప‌ష్టం చేశారు. దీంతో అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీలు ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెర‌పైకి తెచ్చి జ‌గ‌న్ ను త‌మ పార్టీకి మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరుతున్న‌ట్లు తెలిసింది. త‌మ‌కు జ‌గ‌న్‌ మ‌ద్దతు ఇచ్చి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు స‌హ‌క‌రిస్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా గ్యారంటీగా ఇస్తాం అన్న మాట‌తో ఆ పార్టీలు జ‌గ‌న్‌ను సంప్ర‌దిస్తున్నాయ‌ట‌. అయితే ఇంకా ఫ‌లితాలు రాలేదు క‌నుక‌.. ఇప్ప‌టికైతే కేవ‌లం మాట‌లే న‌డుస్తున్నాయి. మ‌రి ఫ‌లితాలు వ‌చ్చాక ఒక వేళ నిజంగానే కేంద్రంలో హంగ్ వ‌స్తే.. ఏపీలో వైసీపీకి సర్వేలు చెప్పిన‌ట్లు 20కి పైగా ఎంపీ స్థానాలు వ‌స్తే.. అప్పుడు జ‌గ‌న్ ఏపార్టీకి మ‌ద్ద‌తు ఇస్తారో చూడాలి.

ఒక వేళ బీజేపీకి జ‌గ‌న్ మ‌ద్ద‌తిస్తే.. ఏపీకి క‌చ్చితంగా ప్ర‌త్యేక హోదా ఇవ్వాలి. లేదంటే ప్ర‌భుత్వం ప‌డిపోతుంది. ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదా ఇస్తే.. అప్పుడు జ‌గ‌న్ ఏపీ ప్ర‌జ‌ల దృష్టిలో గొప్ప నాయకుడిగా నిలిచిపోతాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కాంగ్రెస్‌కు జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చే ప‌రిస్థితి ఉంటే.. మ‌ధ్య‌లో చంద్ర‌బాబు ఉంటారు గ‌న‌క‌.. అప్పుడు ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్ప‌లేం.. ఏది ఏమైనా.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత జ‌గ‌న్ కేంద్రంలో ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తార‌నే అంశం ఇప్పుడు అన్ని వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news