ఒక్కరోజు వేసుకున్న బట్టలేనే మరసటి రోజు ఉతికేస్తాం.. కానీ చాలమంది డైలీ పడుకునే బెడ్షీట్లను పెద్దగా ఉతకరు. అవి మురికిఅయినట్లు కనిపిస్తేనో, పండగలకో వాటిని ఉతుకుతారు. బెడ్షీట్లు మురికిఅయినట్లు కనిపించే వరకు వాటిని శుభ్రం చేయకపోతే.. దుమ్ము-ధూళితో పాటు, కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు పేరుకుపోతాయి. వీటిని వాడడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో పాటు, పలు చర్మ సంబంధిత వ్యాధులు సైతం వచ్చే ప్రమాదం ఉందట. బెడ్షీట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే ఫేస్‌కు కూడా ఎఫెక్ట్ అవుతుంది.
బెడ్షీట్లను వారానికి ఒక్కసారైనా ఉతకాలి. కొన్ని రకాల చర్మ వ్యాధులు లేదా ఇతర అనారోగ్యాలతో బాధపడే వారు క్రమం తప్పకుండా బెడ్షీట్లను మారుస్తూ ఉండాలి. అలాగే అందరూ ఒకటే బెడ్‌షీట్‌ను ఉపయోగించకూడదు.. ఎవరికి వారికి సపరేట్ ఉండాలి. ఇంట్లో వాళ్లైనా సరే.. వాళ్లు బెడ్‌షీట్ వేసుకున్నప్పుడు తుమ్మినా, దగ్గినా కంటికి కనిపించని ఎన్నో క్రిములు బెడ్ షీట్‌కు అంటుకుంటాయి. వాటిని వేరే వాళ్లు అలానే మళ్లీ వాడటం వల్ల చాలా సమస్యలు వస్తకాయి.
కుక్కలను బెడ్‌పైకి ఎక్కిస్తున్నారా..?
కొంతమంది తమ పెంపుడు జంతువులను కూడా బెడ్ పైకి ఎక్కించి ముద్దాడతారు. వారి పక్కనే పడుకోబెట్టుకుంటారు…ఫలితంగా వాటి వెంట్రుకలు లేదా చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఇతర క్రిములు బెడ్‌షీట్‌కి అంటుకునే ప్రమాదం ఉంది.. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు బెడ్ పైకి తీసుకురాకుండానే చూసుకోవాలి. ఒకవేళ తీసుకొచ్చినా రెండురోజులకోసారి బెడ్‌షీట్ మార్చాలన్న విషయం మాత్రం మర్చిపోవద్దు.
ఉతికేప్పుడు ఈ జాగ్రత్తలు అవసరే..!
దుప్పట్లను శుభ్రం చేసే క్రమంలో వేడినీళ్లను ఉపయోగిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా నశిస్తుంది. మురికి త్వరగా వదిలిపోతుంది. అయితే ఈ సమయంలో బెడ్‌షీట్ నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తక్కువ నాణ్యత గల బెడ్షీట్లను మరీ ఎక్కువగా వేడి చేసిన నీళ్లలో నానబెట్టడం వల్ల అవి పాడయ్యే అవకాశం ఉంటుంది.. కాబట్టి అలాంటి వాటిని గోరువెచ్చని నీటిలో డిటర్జెంట్ పౌడర్ వేసి కాసేపు నానబెట్టి ఆపై ఉతికితే సరి..!
త్వరగా మురికి పోవాలని, సువాసన రావాలని కొంతమంది ఎక్కువ డిటర్జెంట్ పౌడర్ని వాడుతుంటారు. అయితే ఈ పౌడర్లను కూడా తగిన మోతాదులోనే వాడాలి. ఎక్కువ మొత్తంలో పౌడర్లను ఉపయోగిస్తే అందులో ఉండే రసాయనాలు బెడ్‌షీట్ నాణ్యతను దెబ్బతీస్తాయి.
ఉతికిన బెడ్షీట్లను ఎండలో ఆరేయాలి. ప్రత్యేకించి వర్షాకాలంలో ఎండ లేనప్పుడు డ్రయర్ వాడడం ఉత్తమం. అవి సరిగ్గా ఆరకపోతే వాటి తడిదనం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందే ప్రమాదం ఉంది.
ఈ తప్పులు అస్సలు వద్దు..
కొంతమంది బద్ధకంతో మేకప్ తీయకుండానే పడుకుంటారు. తద్వారా మేకప్ అవశేషాలు బెడ్‌షీట్, దిండు కవర్‌కు అంటుకుంటాయి. ఇవి కూడా చర్మ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మేకప్ తొలగించుకున్నాకే పడుకోవడం వల్ల బెడ్‌షీట్ శుభ్రంగా ఉంటుంది.. మీ ఫేస్ కూడా బాగుంటుంది.
కొందరికి బెడ్‌పైనే ఆహారం, స్నాక్స్.. వంటివి తినే అలవాటుంటుంది. తద్వారా ఆహార అవశేషాలు బెడ్‌షీట్‌పై పడి అపరిశుభ్రంగా మారతాయి. కాబట్టి బెడ్‌పై కూర్చొని తిన్నప్పటికీ బెడ్‌షీట్‌పై ఆహార పదార్థాలు పడకుండా చూసుకోవాలి.
బయటి నుంచి వచ్చాక దుమ్ము-ధూళి చేరిన కాళ్లతోనే బెడ్‌పైకి ఎక్కడం మానుకోండి.. శుభ్రంగా స్నానం చేయడం లేదంటే చేతులు-కాళ్లు కడుక్కొని డ్రస్ మార్చుకున్న తర్వాతే బెడ్‌పై కూర్చోవడం మేలు.