తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇంతలోనే మునుగోడు ఉప ఎన్నిక ముంచుకురావడంతో.. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఢిల్లీకి రావాలని కబురు పంపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడ్డా… సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. అయితే తెలంగాణలో వరుసబెట్టి ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు తాజాగా ఓ కొత్త డిమాండ్‌ను తెర ముందుకు తీసుకొచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొనసాగుతూ ఇటీవలే దక్షిణాది రాష్ట్రాల పార్టీ ఇంచార్జీగా నియమితురాలైన ప్రియాంకా గాంధీ వాద్రా తెలంగాణలోని మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన ఓ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు వి.హన్మంతరావు.
తన ప్రతిపాదనకు బలం చేకూరేలా ఆయన ఓ కీలక పరిణామాన్ని ప్రస్తావించారు. గతంలో పార్టీ అధినేత్రిగా వ్యవహరించిన భారత దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచిన విషయాన్ని వి.హన్మంతరావు ప్రస్తావించారు. 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1984 వరకు ఆమె మెదక్ పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగారు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన వీహెచ్… తన నానమ్మ మాదిరే ప్రియాంకా గాంధీ కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని వి.హన్మంతరావు ప్రతిపాదించారు.