బైక్ ఆపలేదన్న కోపంతో వాహనదారున్ని కర్ణభేరి పగిలేలా కొట్టాడు ఓ ఎస్ఐ. నిజామాబాద్ జిల్లాకి చెందిన ఓ ఎస్ఐ తన ప్రతాపం చూపించాడు. ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన పట్టెం శ్రీనివాస్ గత నెల 25వ తేదీన పనుల నిమిత్తం పొలానికి వెళుతుండగా.. ధర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణ తన సిబ్బందితో రామడుగు గ్రామ శివారులో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు.
అయితే శ్రీనివాస్ పోలీస్ చెకింగ్ చూసుకోకుండా హడావిడిగా పొలం దగ్గరకు వెళ్లి తిరిగి ఐదు నిమిషాలలో వచ్చాడు. దీంతో ఎస్ఐ కోపంతో శ్రీనివాస్ చెంప చెల్లుమనిపించాడు. ఎస్సై కొట్టిన దెబ్బకు శ్రీనివాస్ చెవిలో రీ సౌండ్ రావడంతో భయపడిపోయాడు. వెంటనే నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ఈఎస్టి వైద్యునికి చూపించుకోవడంతో చెవిలో కర్ణభేరి దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అయితే తనను అకారణంగా కొట్టారంటూ ఎస్సై వంశీకృష్ణ పై హెచ్ఆర్సీని ఆశ్రయించాడు శ్రీనివాస్.
తనకి లైసెన్స్, బైక్ పేపర్స్ అన్నీ ఉన్నాయని చెప్పినా వినిపించుకోకుండా కొట్టారంటూ బాధితుడు వాపోయాడు. ఎస్సై కొట్టిన దెబ్బకు తనకు వినికిడి సమస్య వచ్చిందని.. ఈ లోపంతో నేను గల్ఫ్ దేశం వెళ్లే ఉపాధి కోల్పోతానని ఆవేదనను హెచ్ఆర్సికి నివేదించాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని బాధితుడు శ్రీనివాస్ హెచ్ఆర్సీ ని కోరాడు. దీంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.