Oke Oka Jeevitham Review: ‘ఒకే ఒక జీవితం’ రివ్యూ.. శర్వానంద్‌ హిట్ కొట్టినట్టేనా!

-

శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీకార్తీక్‌ తెరకెక్కించిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు సంయుక్తంగా నిర్మించారు. హీరోకి తల్లి పాత్రలో అమల అక్కినేని, కథానాయికగా రీతూ వర్మ నటించారు. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది?

కథ: ఆది (శర్వానంద్) గిటారిస్ట్. చైతు (ప్రియదర్శి) పెళ్లి చేసుకోవడం జీవిత లక్ష్యం అన్నట్లు సంబంధాలు చూస్తుంటాడు. శ్రీను (‘వెన్నెల’ కిశోర్) అద్దె ఇంటి కోసం వెతికే వాళ్లకు ఇల్లు చూపించే బ్రోకర్… ముగ్గురూ చిన్ననాటి నుంచి స్నేహితులు. ఆది చిన్నతనంలోనే సంగీతం వైపు అడుగులు వేసేలా తల్లి (అమల అక్కినేని) ప్రోత్సహిస్తుంది. ఆమె ఇరవై ఏళ్ల క్రితం మరణిస్తుంది. ఆది మనసులో బాధ, తల్లి లేని వెలితి ఉంటాయి. ఒక రోజు శ్రీనుతో పాటు వెళ్లిన అతడికి సైంటిస్ట్ రంగి కుట్ట పాల్ (నాజర్) పరిచయం అవుతాడు. ఇరవై ఏళ్లు వెనక్కి పంపిస్తానని, తల్లితో మళ్లీ కలిసేలా చేస్తానని చెబుతాడు. అందుకు, ఆది సరేనంటాడు. అతడితో పాటు చైతు, శ్రీను కూడా కాలంలో వెనక్కి వెళ్తారు. ఆ తర్వాత ఏమైంది? విధిరాతను మార్చగలిగారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ: జీవితం ఎవ‌రికీ రెండో అవ‌కాశం ఇవ్వ‌దు. ఒకవేళ అలాంటి అవ‌కాశం వ‌స్తే .. విధి రాత‌ను మార్చుకోగ‌ల‌మా! అనే పాయింట్‌ను తీసుకుని ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ రాసుకున్న క‌థే ‘ఒకే ఒక జీవితం’. ఓ కాలం నుంచి మరొక కాలానికి వెళ్లడం నిజ జీవితంలో సాధ్యం కాదు కనుక… అటువంటిది తెరపై జరుగుతుంటే కొత్తగా అనిపిస్తోంది. ఇప్పుడు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మూవీస్ వాళ్లకు కొత్త కాదు. రీసెంట్‌గా ‘బింబిసార’ వచ్చింది. విజయం సాధించింది. మరి, ‘ఒకే ఒక జీవితం’లో కొత్త పాయింట్ ఏంటంటే… దర్శకుడు కథను నడిపించిన విధానమనే చెప్పాలి. ఇంటర్వెల్ వరకు ‘ఒకే ఒక జీవితం’ కథ సాధారణంగా సాగింది. తల్లికి దూరమై, ఆమెను తలుచుకునే కుమారుడు… పెళ్లి కోసం పరితపించే మరో యువకుడు… చదువు లేకపోవడంతో జీవితంలో ఇబ్బందులు పడిన మరో యువకుడు… కథలో కొత్త అంశాలు ఏవీ లేవు. అయితే, సినిమా పరుగులు తీయడంతో పెద్దగా కంప్లైంట్స్ ఏమీ కనిపించవు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో? అనే కుతూహలం పెంచుతుంది. థ్రిల్ ఇస్తుంది. సెకండాఫ్‌లో మదర్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్ ఫ్రంట్ సీట్ తీసుకున్నాక… స్క్రీన్ ప్లేలో స్పీడ్ తగ్గింది. సాగదీత ఎక్కువైంది. అయితే, నిదానంగా వెళ్ళడం వల్ల నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. శర్వా, అమల, చిన్న పిల్లలు కొన్ని సన్నివేశాలను తమ నటనతో నిలబెట్టారు. ఇంటర్వెల్ తర్వాత సినిమాను రేసీగా నడిపిస్తే బావుండేది.

నటీనటులు ఎలా చేశారంటే..: శర్వానంద్ నటుడిగా మరోసారి మెరిశారు. అక్కినేని అమలతో పాటు కనిపించే భావోద్వేగ భరిత సన్నివేశాల్లో డైలాగులు లేకున్నా… కేవలం కళ్లతో హావభావాలు పలికించారు. పాత్ర పరిధి మేరకు చక్కటి అభినయం కనబరిచారు. తల్లిగా అక్కినేని అమలను చూడటం కొత్తగా ఉంటుంది. రెగ్యులర్, సీజనల్ ఆర్టిస్టులు, సీనియర్ హీరోయిన్లను కాకుండా ఆమెను తీసుకోవడం వల్ల ఫ్రెష్‌నెస్‌ వచ్చింది. ‘వెన్నెల’ కిశోర్ తనలో కమెడియన్ మాత్రమే కాదు, ఆర్టిస్ట్ కూడా ఉన్నాడని కొన్ని సన్నివేశాల్లో చూపించారు. చాలా చోట్ల నవ్వించారు. ప్రియదర్శి పర్వాలేదు. ఇక, సైంటిస్ట్‌గా నాజర్… హీరో ప్రేయసి పాత్రలో రీతూ వర్మ చక్కగా నటించారు. చిన్న పిల్లాడు ‘అక్క’ అని పిలిచే సన్నివేశంలో రీతూ వర్మ ఎమోషన్స్ హైలైట్. హీరో చైల్డ్‌హుడ్‌ రోల్ చేసిన ‘మాస్టర్’ జై ఆదిత్య కొన్నాళ్లు గుర్తుంటాడు. ఆ వయసులో అటువంటి ఎమోషనల్ సీన్స్ చేయడం మామూలు విషయం కాదు. జై ఆదిత్యతో పాటు మరో ఇద్దరు చిన్నారులు కూడా బాగా చేశారు.

చివరగా…: ‘ఒకే ఒక జీవితం’… రెగ్యులర్‌గా చూసే సినిమాలకు డిఫరెంట్ పాయింట్‌తో రూపొందిన సినిమా. ‘ఒకే ఒక జీవితం’ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది, అక్కడక్కడా కంటతడి పెట్టిస్తుంది. చివర్లో చిన్న సందేశం కూడా ఇస్తుంది.

మనకూ ‘ఓకే ఒక జీవితం’ కాబట్టి ఇలాంటి సినిమాలు చూడొచ్చు!!

 

  • సినిమా : ఒకే ఒక జీవితం
  • నటీనటులు : శర్వానంద్, అమల అక్కినేని, రీతూ వర్మ, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్
  • మాటలు : తరుణ్ భాస్కర్
  • సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్
  • సంగీతం: జేక్స్ బిజాయ్
  • నిర్మాతలు : ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. శేఖర్
  • రచన, దర్శకత్వం : శ్రీ కార్తీక్
  • విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 2022
  • రేటింగ్ : 3.5

Read more RELATED
Recommended to you

Latest news