ఏపీలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఫ్లై ఓవర్ కిందనున్న ఓ దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అవి క్రమంగా పక్కనున్న షాపులకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అలాగే, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రమాద స్థలానికి చేరుకుని కాలిబూడిదైన దుకాణాలను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులతో సమావేశమై నష్టాన్ని అంచనా వేస్తామని, అనంతరం బాధితులకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గుంటూరులోని ఏటూకూరు రోడ్డలో గల ఆర్ఎస్ పాలీమర్స్ ప్లాస్టిక్ వ్యర్ధాల గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సుమారు 50 లక్షల ఆస్తినష్టం జరిగింది. అయితే… సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు.