ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో రావడంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. నిప్పు లేనిదే పొగ వస్తుందా..? అలాగే ఏ సంబంధం లేకుండానే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇస్తుందా..? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబం చేసినంత అవినీతి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదని ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తూ తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ తుగ్లక్ మాదిరిగా ఎప్పుడు ఏం చేస్తారో..? ఏం మాట్లాడుతారో తెలియదన్నారు. ముందస్తుకు పోతారేమో కూడా తెలియదన్నారు రాజగోపాల్ రెడ్డి.
నలుగురు ఎమ్మెల్యేలను కొని బీజేపీ తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆరోపించినప్పుడే ఆయనకు మతి స్థిమితం పోయినట్లు అర్థమవుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తమ కుటుంబంపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న విషయాన్ని..మునుగోడు ఉప ఎన్నిక నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే ఎమ్మెల్యేల కొనుగోలు విషయాన్ని కేసీఆర్ తెర ముందుకు తెచ్చారని ఆరోపించారు. నిప్పులేనిదే పొగ వస్తుందా..? ఏ సంబంధం లేకుండానే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులిస్తుందా..? అని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ తన స్వార్థం కోసం అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి.