తారక రత్న మృతదేహాన్ని బెంగులూరు నుంచి హైదరాబాద్ మోకిల లోని తన నివాసానికి తరలించారు. ఈ నేపథ్యంలోనే తారక రత్న భౌతిక దేహాన్ని సందర్శించుకోవడానికి సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరికి మోకిల చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, భర్తను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న అలేఖ్యా రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఆమె ఆహారం తీసుకోవడంలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాంతో నీరసించిందని వివరించారు. కాగా, అలేఖ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తారకరత్న గత నెల 27వ తేదీన కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయనను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి, అత్యున్నతస్థాయి వైద్యం అందించారు. అయితే, గత రెండు రోజులుగా ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారినట్టు తెలుస్తోంది. భర్త ఆరోగ్యం బాగా క్షీణించడంతో అలేఖ్యా రెడ్డి తీవ్ర వేదనకు గురయ్యారు. నిన్న తారకరత్నకు నిర్వహించిన స్కానింగ్ తో ఆయన ఆరోగ్యం విషయంలో ఏమాత్రం పురోగతి లేదన్న విషయం స్పష్టమైంది. బ్రెయిన్ లో జరిగిన డ్యామేజిని చక్కదిద్దేందుకు వైద్యులు గత కొన్ని రోజులుగా చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారణకు వచ్చారు. దాంతో ఆయన మరణించినట్టు నిన్న ప్రకటించారు.