ఎడిట్ నోట్: ‘సీఎం’ రేవంత్.!

-

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే సంగతి తెలిసిందే. ఏపీలో పార్టీ దెబ్బతింటుందని తెలిసి కూడా ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ ఏపీలో ఎలాగో పార్టీ దెబ్బతింది..తెలంగాణలో కూడా అదే పరిస్తితి వచ్చింది. వరుసగా రెండు ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కంటే..తెలంగాణ తెచ్చిన కేసీఆర్ వైపే ప్రజలు నిలిచారు. పైగా తెలంగాణ సెంటిమెంట్‌ని కే‌సి‌ఆర్ రాజకీయంగా బాగా వాడుకున్నారు. అయితే రెండుసార్లు కే‌సి‌ఆర్‌కు అవకాశం ఇచ్చారు కదా..ఒక్కసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..తెలంగాణ ప్రజలని కోరుతున్నారు.

పాదయాత్రలో భాగంగా ఆయన జనంలో తిరుగుతూ..సమస్యలు తెలుసుకుంటూ..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై హామీలు ఇస్తున్నారు. కీలక హామీలు ఇచ్చి ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ హామీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇక పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ ఇమేజ్ బాగా పెరుగుందని అంచనా వేస్తున్నారు. నాడు వైఎస్సార్ ఏ విధంగా పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో..నేడు రేవంత్ అలాగే అధికారంలోకి తీసుకొస్తారని కాంగ్రెస్ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అప్పుడు వైఎస్సార్ సి‌ఎం ఎలా అయ్యారో..ఇప్పుడు రేవంత్ అలాగే సి‌ఎం అవుతారని..ఆయన వర్గం నేతలు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే వరంగల్ లో పాదయాత్ర చేస్తున్న రేవంత్‌ని ఉద్దేశించి కొండా సురేఖ తన మనసులో మాటని బయటపెట్టారు.  నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎంత విశ్వసించామో.. నేడు రేవంత్ రెడ్డిని కూడా అంతే విశ్వసిస్తున్నామని, రేవంత్ రెడ్డితోనే ఇందిరమ్మ పాలన సాధ్యమని, రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని కొండా సురేఖ ఆకాంక్షించారు. మొత్తానికి సురేఖ తన మనసులో మాటని బయటపెట్టారు. అయితే రేవంత్ వర్గానికి..రేవంత్ సి‌ఎం అవ్వాలనే కోరిక ఉంది. కానీ సీనియర్లు అందుకు ఒప్పుకోరు..అందుకే ఎవరు రేవంత్ సి‌ఎం అవ్వాలనే కోరిక బయటపెట్టలేదు. ఇప్పుడు సురేఖ బయటపెట్టారు. మరి దీనిపై సీనియర్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక కాంగ్రెస్ గెలవడం, రేవంత్ సీఎం అవ్వడం జరుగుతాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news